హామీలకు చట్టబద్ధత | YS Jagan Mohan Reddy Meeting On 12 Welfare Bills In Amaravati | Sakshi
Sakshi News home page

హామీలకు చట్టబద్ధత

Published Wed, Jul 10 2019 2:24 AM | Last Updated on Wed, Jul 10 2019 10:56 AM

YS Jagan Mohan Reddy Meeting On 12 Welfare Bills In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 60 శాతం మేర నెల రోజుల్లోనే అమల్లోకి తీసుకువచ్చి తన చిత్తశుద్ధిని, ఇచ్చిన మాటపై నిలబడటాన్ని చాటి చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ఆ హామీల్లోని పలు అంశాలకు 40 రోజుల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. గురువారం నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా మొత్తం 12 బిల్లులను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి చట్టబద్ధత కల్పించాలనే విషయమై మంగళవారం ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో సుమారు మూడు గంటలకు పైగా సుదీర్ఘ కసరత్తు చేశారు. ఆయా బిల్లులపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎటువంటి పొరపాట్లు లేకుండా ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని, న్యాయ శాఖతో సమన్వయంతో బిల్లులను రూపొందించాలని చెప్పారు. ఆయా బిల్లులపై మంత్రులు, అధికార సభ్యులు పూర్తి అవగాహనతో ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా చట్టాలను తీసుకురావడంతో పాటు, ఇదివరకు చేసిన చట్టాల్లో సవరణల కోసం ఉద్దేశించిన బిల్లులు ఇప్పటికే తుదిరూపు దిద్దుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులతో సమావేశం అయ్యారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ బిల్లులు రూపొందబోతున్నాయి. 
 
ప్రభుత్వ ఉద్ధేశం స్పష్టంగా ఉండాలి 
అంతకంతకూ పెరిగిపోతున్న స్కూలు, కాలేజీ ఫీజులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సామాజిక వేత్తల నుంచి వైఎస్‌ జగన్‌ 14 నెలల సుదీర్ఘ పాదయాత్ర సమయంలో పెద్ద ఎత్తున అర్జీలు, ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి నియంత్రణ, పర్యవేక్షణకు చేయనున్న చట్టం కట్టుదిట్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతులు, శాశ్వత బీసీ కమిషన్‌.. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం తదితర అంశాలపై రూపొందించే చట్టాల విషయమై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రతి బిల్లులో ప్రభుత్వ ఉద్దేశాలు, తీసుకురాబోతున్న చట్టాల వల్ల ప్రజలకు ఏవిధంగా ప్రయోజనం కలగబోతుందన్న అంశాలను స్పష్టంగా పేర్కొనాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన బిల్లుల వివరాలు ఇలా ఉన్నాయి.  
 
స్థానికంగా ఉపాధికి ఊతం 

పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించే దిశగా చట్టాన్ని తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులతో మాట్లాడారు. ఈ చట్టం పకడ్బందీగా ఉండాలని, ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగత్రలు తీసుకోవాలని చెప్పారు. పాదయాత్ర సమయంలో ఈ విషయంపై వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ చట్టం కార్యరూపం దాలుస్తోంది.  
 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి రోజులు 
ఇప్పటికే మంత్రివర్గంలో 60 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించడమే కాకుండా ఎస్సీ మహిళకు హోం శాఖను అప్పగించి ఇప్పటికే ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వర్గాలకు నామినేషన్‌ పదవులు, ఐదు లక్షల రూపాయలలోపు నామినేషన్‌ పనుల్లో 50 శాతం కల్పిస్తూ చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు.   
 
వెనుకబాటుతనాన్ని చెప్పుకోవచ్చిక.. 
వివిధ కులాలను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సభల్లో.. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎవరైనా బీసీలుగా గుర్తింపు పొందడానికి ఆ కమిషన్‌కు దరఖాస్తు చేసుకుంటే వారి స్థితిగతులతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఎందుకు వారు బీసీలుగా మారాలని కోరుకుంటున్నారనే అంశాలను అధ్యయనం చేసి బీసీ కమిషన్‌ సిఫార్సులు చేస్తుందని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు ఇందుకు అనుగుణంగా శాశ్వత ప్రాదిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించనున్నారు. 
 
ఏపీఐడీఈ చట్టంలో మార్పులు 

ఇష్టానుసారం టెండర్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం చెక్‌ పెట్టనుంది. స్విస్‌ చాలెంజ్‌ ముసుగులో అస్మదీయ సంస్థలకు నామినేషన్‌పై కట్టబెట్టడం వంటి అనైతిక చర్యలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పులుస్టాప్‌ పెట్టనుంది. ఒక రకంగా చెప్పాలంటే గత టీడీపీ సర్కారు రాష్ట్ర ఖజానా నుంచే భారీ దోపిడీకి పాల్పడింది. ఈ నేపధ్యంలో టెండర్ల విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రజాధనాన్ని వృధా కాకుండా ఆదా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా టెండర్ల స్క్రూటినీకి జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ప్రభుత్వం తొలి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే చట్ట సవరణలను చేయాలని నిర్ణయించింది. గత చంద్రబాబు సర్కారు రాజధానిలో సింగపూర్‌ ప్రైవేట్‌ సంస్థల కోసం స్విస్‌ చాలెంజ్‌ ముసుగులో కారు చౌకగా రైతుల నుంచి తీసుకున్న భూములను అప్పగించేందుకు వీలుగా ఏపీఐడీఈ చట్టంలో సవరణలు తీసుకువచ్చింది.

స్విస్‌ చాలెంజ్‌ విధానంలో సీఎస్‌ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆథారిటీ తొలుత ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించాల్సి ఉండగా, గత టీడీపీ సర్కారులో సింగపూర్‌ కంపెనీల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపాక ఆ అథారిటీకి ఆ ప్రతిపాదనలను పంపించారు. దీనిని హైకోర్టు తప్పుపట్టడంతో ఆ అథారిటీనే రద్దు చేస్తూ ఏపీఐడీఈ–2001 చట్టంలో చంద్రబాబు సర్కారు సవరణలు చేసింది. అలాగే సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలు కోరిన విధంగా రాజధాని భూములపై సర్వహక్కులు కల్పిస్తూ మరోసారి చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణలన్నీ  సింగపూర్‌ కంపెనీలకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించేలా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీఐడీఈ చట్టం నుంచి ఈ సవరణలన్నీ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ఇందుకు అనుగణంగా ఏపీఐడీఈ చట్టంలో సవరణలను తీసుకురానున్నారు. ఏపీఐడీఈ చట్టం ప్రస్తుతం పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టే ప్రాజెక్టులకే వర్తించనుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల పనులన్నింటినీ కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా చట్టంలో సవరణలను ప్రతిపాదించనున్నారు. ఇదే చట్టంలో టెండర్లను జ్యుడిషియల్‌ స్క్రూటినీ చేసేందుకు వీలుగా జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ప్రొవిజన్‌ను కొత్తగా చేర్చనున్నారు. దీంతో ఇక పీపీపీ ప్రాజెక్టులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల పనుల టెండర్లను పూర్తి పారదర్శకతతో జ్యుడిషియల్‌ స్క్రూటినీ అనంతరమే ఖరారు చేయనున్నారు. 
 
భూముల రీ సర్వే 

రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం భూములపై ఉన్న హక్కులు ఊహాజనితమేనని, వాస్తవ హక్కులు కాదని, దీంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒకరికి చెందిన భూమి మరొకరు కాజేయడం, భూమి హక్కు పత్రాలను సృష్టించడం వంటి చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇందుకు స్వస్తి పలికి రాష్ట్రంలో భూములన్నీ రీ సర్వే కోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు అనుగుణంగా సమగ్ర టైటిల్‌ను కల్పించేందుకు వీలుగా చట్టం తీసుకురానున్నారు. భూములు రీ సర్వే చేసి శాశ్వత హక్కు కల్పించిన తరువాత సివిల్‌ న్యాయస్థానాలు కూడా ప్రశ్నించకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఆలయ పాలక మండళ్లపై సర్కారుకే అధికారం 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో సహా పలు ఆలయాల పాలకమండళ్లు, ట్రస్టుల చైర్మన్లు, సభ్యులను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రీకాల్‌ చేయనుంది. ఆ నియమాకాలను సూపర్‌ సీడ్‌ చేసే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ దేవదాయ చట్టంలో సవరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీటీడీతో పాటు వివిధ ట్రస్టుల ఛైర్మన్లు, సభ్యులకు సంబంధించి రాజకీయ నియామకాలు జరుగుతుంటాయి. సాధారణంగా ప్రభుత్వం మారితే గత ప్రభుత్వం నియమించిన రాజకీయ పదవుల్లోని వారు రాజీనామా చేస్తారు. అయితే ఇప్పుడు పలువురు రాజకీయం చేయడానికి ఆ పదవుల్లోనే అంటిపెట్టుకుని ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ సహా ఇతర ట్రస్టుల చైర్మన్లు, సభ్యులను రీకాల్‌ చేసే అధికారం ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేలా దేవదాయ శాఖ చట్టంలో సవరణలు తీసుకువస్తూ ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఎట్టకేలకు లోకాయుక్త  

రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో లోకాయుక్త ఏర్పాటు కాలేదు. గత ఐదేళ్ల చంద్రబాబు సర్కారు లోకాయుక్త ఏర్పాటుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ తొలి బడ్జెట్‌ సమావేశాల్లోనే లోకాయుక్త ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ తరహాలోనే లోకాయుక్త చట్టానికి సవరణలు చేస్తూ లోకాయుక్త ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌తోనే లోకాయుక్త ఏర్పాటు చేయాలని ప్రస్తుత చట్టంలో ఉంది. అయితే రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌లు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోయిన పక్షంలో రిటైర్డ్‌ జడ్జిని నియమించేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ ప్రస్తుత అసెంబ్లీసమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.  
 
విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట 

ప్రైవేట్‌ విద్యా సంస్థలు విద్యను వ్యాపారం చేయడాన్ని నియంత్రించేందుకు, ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్థలు పటిష్టం చేయడానికి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్య, కాలేజీ విద్య నియంత్రణ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఫీజుల నియంత్రణతో పాటు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి సమగ్ర బిల్లును అసెంబీల్లో ఆమోదించడం ద్వారా చట్టబద్ధత కల్పించనున్నారు. 
 
కౌలు రైతులకు అండ 

భూ యజమానుల హక్కులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం ఇచ్చేందుకు వీలుగా చట్టంలో సవరణలు తీసుకురావాలని నిర్ణయించారు. 11 నెలల పాటు కౌలు ఒప్పందంపై కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేయనున్నారు.  
 
కల్తీ విత్తనాలు, నకిలీ పురుగు మందులకు చెక్‌ 
రాష్ట్రంలో రైతులను పట్టిపీడుస్తున్న కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు చెక్‌ పెట్టాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విత్తన కంపెనీలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందాలను చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం చేసుకున్న కంపెనీల నుంచే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనాలని రైతులకు ప్రభుత్వం సూచించనుంది. విత్తన, ఇతర కంపెనీల టర్నోవర్‌ ఆధారంగా సెక్యూరిటీ డిపాజిట్‌ను నిర్ధారించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు వంద కోట్ల టర్నోవర్‌ గల కంపెనీ అయితే రెండు కోట్ల రూపాయల మేర సెక్యూరిటీ డిపాజిట్‌ చేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

కంపెనీలతో చేసుకునే అవగాహన ఒప్పందాల్లోనే నకిలీ విత్తనాల వల్ల మొలకెత్తకపోయినా లేదా దిగుబడి రాకపోయినా, దిగుమతి తగ్గినా ఆయా రైతులకు నష్టపరిహారం ఆయా కంపెనీల ద్వారా చెల్లించేలా క్లాజులను పొందు పరచాలని భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. నకీలీ విత్తనాలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మధ్యే మార్గంగా విత్తన కంపెనీలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందాలను చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు.  

ప్రభుత్వం మారినా పదవులు వదలని నేతలు   
అధికారం కోల్పోయిన తర్వాత నైతిక ప్రమాణాలు, విలువలు పాటించి గత ప్రభుత్వంలో దక్కిన నామినేటెడ్‌ పదవులకు రాజీనామా చేసే సంప్రదాయాన్ని టీడీపీ నేతలు పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కావస్తున్నా చాలా మంది టీడీపీ నేతలు ఇంకా తమ పదవులను వదిలేందుకు ఇష్టపడడం లేదు. టీటీడీ చైర్మన్‌గా పని చేసిన పుట్టా సుధాకర్‌ యాదవ్‌ రాజీనామా చేయకుండా మొండికేశారు. ఎట్టకేలకు విమర్శలు తట్టుకోలేక రాజీనామా చేశారు.

ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న వర్ల రామయ్య, ఎస్సీ కో–ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్, శాప్‌ చైర్మన్‌ అంకమ్మ చౌదరి, ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌ మీరా, ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దివి శివరాం, స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నామన రాంబాబు, ఆర్టీసీ రీజియన్‌ చైర్మన్లు.. ఇలా చాలా మంది ఇంకా ఆ పదవులను పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. అధికార మార్పిడి తర్వాత వదిలిపెట్టాల్సిన పదవులను వదిలే విషయంపై చంద్రబాబు సైతం వారికి సరైన దిశా నిర్దేశం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదవులు వదలని వ్యవహారంపై టీడీపీలోని పలువురు సీనియర్‌ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తరచూ నీతులు, విలువల గురించి చెబుతూ ఆచరణలో పాటించక పోవడం సరికాదనే అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement