సాక్షి, తుని : చంద్రబాబు నాయుడు పాలనంతా అవినీతిమయమని... ఇసుక, మట్టి, గుడి భూములు సహా దేన్నీ వదలడం లేదని.. కాపు రిజర్వేషన్ల ఉద్యమం సమయంలో కుట్ర పూరితంగా రైలును తగలబెట్టించిన ఘనుడు ఏపీ సీఎం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. మఠానికి చెందిన 425 ఎకరాల భూమిని కాజేసేందుకు చూసిన చంద్రబాబు, దేవుడి భూములను బ్యాంకుల్లో తాకట్టు పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు బినామీ కంపెనీ దివీస్ అని పేర్కొన్న వైఎస్ జగన్, దివీస్‌కు భూములు ఇవ్వలేదని రైతులపై కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 234వ రోజు శనివారం తుని పట్టణానికి చేరుకుంది. ఇక్కడ అడుగుపెట్టగానే రాజన్న తనయుడి పాదయాత్ర 2700 కిలోమీటర్ల అరుదైన మైలురాయిని చేరుకోవడం విశేషం. తూర్పు గోదావరి జిల్లా తునిలో జననేత జగన్‌కు ప్రజలు, పార్టీనేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొన్న వైఎస్ జగన్.. సీఎం చంద్రబాబు నాలుగన్నరేళ్ల పాలనంతా అవినీతేనంటూ నిప్పులు చెరిగారు.
చంద్రబాబు బినామీ కంపెనీ దివీస్
‘ఏపీ సీఎం చంద్రబాబు బినామీ కంపెనీ దివీస్.రైతన్నల నుంచి మాత్రం ఎకరాలకు ఎకరాలు లాగేసుకుంటున్నారు. దివీస్‌కు భూములు ఇవ్వలేదని రైతులపై కేసులు పెడుతున్నారు. కంపెనీలు రావాల్సిన చోట రావాలి. విశాఖలో ఫార్మా కంపెనీ వచ్చి ఉంటే అందరం సంతోషించేవాళ్లం. కానీ అతిపెద్ద హాచరిస్ ఉన్న తుని నియోజకవర్గంలోని ప్రాంతంలో ఇలాంటి కంపెనీలా. పైగా కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని ఆక్వా జోన్‌గా ప్రకటించింది. ఇక్కడ ఫార్మా కంపెనీలు పెట్టి నీళ్లను కలుషితం చేసి ఆక్వాజోన్‌కు ఆటంకాలు కలిగిస్తున్నారు చంద్రబాబు.
కాపు రిజర్వేషన్లకు మద్దతిచ్చాం
ఇదే తుని నియోజకవర్గంలో కాపుల రిజర్వేషన్లకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతిచ్చింది. దానివల్ల ఏం జరిగిందంటే 75 శాతం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కేసుల్లో ఇరికించారు. కుట్రపూరితంగా రైలును తగలబెట్టించిన వ్యక్తి సీఎం చంద్రబాబు. ఎస్సీలు, బీసీలు, ఆడపడచులు, చివరికి వికలాంగులపై కూడా కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రైలు దగ్దం ఘటనలో నమోదైన తప్పుడు కేసులన్నింటినీ ఎత్తేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
తునిని ఏ విషయంలోనూ పట్టించుకోలేదు
తుని ప్రభుత్వాసుపత్రిని పట్టించుకునే వారే లేరు. లెక్క ప్రకారం ఇక్కడ ఆస్పత్రుల్లో 11 మంది డాక్టర్లు ఉండాలి, కానీ నలుగురే ఉన్నారు. తునిలో 108 అంబులెన్స్ కూడా పనిచేయడం లేదు. అయితే
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తునిలో 11 వేళ ఇళ్లు కట్టించి ఇచ్చారు. తాండవ నుంచి మంచినీటి కోసం మహానేత హయాంలో రూ.26 కోట్లు ఇచ్చారు. ఆ మహానేత నేడు మనమధ్య లేకపోవడంతో ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. కరకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చి నాలుగన్నరేళ్లు గడిచినా లాభం లేదు. చెత్త వేయడానికి తునిలో డంపింగ్ యార్డ్ కూడా లేదని, శ్మశానాలలో చెత్త వేయాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం తుని నియోజకవర్గంలోనే ఇన్ని సమస్యలుంటే.. రాష్ట్రం మొత్తం ఇంకా ఎన్ని సమస్యలున్నాయో అని అన్నారు.
వైఎస్ జగన్ ప్రసంగంలోని మరిన్ని అంశాలివి:
- నిరుద్యోగ భృతి కింద బాబు ప్రతి ఇంటికీ లక్ష రూపాలయు బాకీ. నేడు కేవలం 10 లక్షల మందికి వెయ్యి రూపాయల చొప్పున ఇస్తారట. అదీ 4 నెలలు మాత్రమే అంటున్నారు
- చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పిందేంటి.. ఇప్పుడు చేస్తున్నదేంటి. అబద్దాలు చెప్పేవాళ్లు.. మోసాలు చేసేవాళ్లు మీకు నాయకుడిగా కావాలా...?
- రైతన్నలకు రుణాలు మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నాడు. నేడు ఏమైంది. 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయా, కనీసం బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన బంగారమైనా ఇంటికి వచ్చిందా అంటే అది లేదన్నారు.
- అక్కాచెల్లెమ్మలను కూడా మోసం చేసి వారి చేత కన్నీళ్లు పెట్టించిన ఘనుడు చంద్రబాబు
- చిన్నపిల్లలు కదా అని వారి జోలికి వెళ్లడానికి ఇష్టపడరు. కానీ జాబు రావాలంటే బాబు రావాలని.. విద్యార్థులను నట్టేట ముంచారు చంద్రబాబు. కేవలం చంద్రబాబుకే జాబు వచ్చింది.
- మీ పిల్లలు ఏదీ చదవకపోయినా పర్వాలేదు. ప్రతి ఇంటికి చంద్రబాబు ఉద్యోగం లేక ఏదైనా ఉపాధి ఇస్తారు. లేనిపక్షంలో నెలనెలా రూ.2 వేలు ఇస్తామని చెప్పారు
- ఉచితంగా పిల్లలకు చదువు చెప్పించాల్సిన సీఎం చంద్రబాబు తానే బినామీగా మారి నారాయణ, శ్రీచైతన్య అనే ప్రైవేట్ విద్యాసంస్థలను నిర్వహిస్తుండటం మన దౌర్భాగ్యం.
- ఇలాంటి విద్యాసంస్థల్లో చదవాలంటే ఏడాది లక్షలకు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ పేదలకు అది సాధ్యం కాదు.
- మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. స్కూలు ఫీజులు, కాలేజీ ఫీజులు తగ్గిస్తాం.
- మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి గత నాలుగైదు నెలలుగా చెల్లించాల్సిన బకాయిలు ఇంకా ఇవ్వకుండా విద్యార్థుల్ని ప్రైవేట్ బాట పట్టించాలన్నదే చంద్రబాబు ఉద్దేశం
- పిల్లల్ని బడికి పంపే తల్లులకు 15 వేల రూపాయలు ఇస్తాం. అప్పుడు ఆ తల్లులు చదువుకుని ప్రయోజకులు అయ్యి కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు.
- మెస్, బోర్డింగ్ ఛార్జీల కోసం రూ.20 వేలు అందిస్తాం. ఇంజినీరింగ్ కోసం కేవలం రూ.35 వేలు ప్రభుత్వం చెల్లిస్తే.. మిగతా 65 వేల ఫీజును కట్టలేక పేద విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు.
చంద్రబాబును ఏపీ ప్రజలు క్షమించరు
‘ఎన్ని తప్పులు చేసినా చంద్రబాబును ఇలాగే క్షమిస్తూ పోతే.. ఎన్నికలప్పుడు మరోసారి మీ వద్దకు వస్తాడు. ఎన్నికల హామీల్లో 90శాతంపైగా నెరవేర్చానంటాడు. అయితే మీరు చిన్న చిన్న మోసాలు, అబద్ధాలు నమ్మరని సీఎంకు తెలుసు. అందుకే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు చంద్రబాబు. అయినా నమ్మరని తెలిసి, ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామని చెబుతాడు. ఆపై మహిళా సాధికారమిత్ర అని కొందరు మీ ఇంటికొచ్చి రూ.3 వేలు ఇస్తారు. వద్దనకుండా రూ.5 వేలు గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లోంచి దోచేసినది. ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షిని నమ్మి ఓటేయాలంటూ’ జననేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నవాళ్లు తనను నేరుగా కలుసుకోవచ్చునని, తాను బసచేసే చోటు అందరికీ తెలుసునన్నారు వైఎస్ జగన్.
Comments
Please login to add a commentAdd a comment