సాక్షి, సత్తెనపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరుదాటాక తెప్పతగలేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం సత్తెనపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలకు చంద్రబాబు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని? రైతులు అడుగుతున్నారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఉన్నదేంటి? చంద్రబాబుకు లేనిదేంటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌కు ఉన్నది రోషం. మన చంద్రానికి రోషం లేదు. అవినీతి సొమ్ము మాత్రం విచ్చలవిడిగా ఉంది.
ఆ డబ్బుతో ప్రతిపక్షం ఎమ్మెల్యే, ఎంపీలను కొంటున్నారు. లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిన చంద్రబాబు ఏపీకి నీటి విడుదలపై కేసీఆర్‌తో మాట్లాడలేక భయపడుతున్నారు. ఏమైనా మాట్లాడితే టేపులను బయటకు తీసి కేసీఆర్ జైల్లో వేయిస్తాడని చంద్రబాబు వణికిపోతున్నాడు. నాలుగేళ్లుగా రైతులు కష్టపడాల్సిన పరిస్థితి చంద్రబాబు వల్లే వచ్చింది. ఇవాళ నీళ్లు లేని కారణంగా బంగారం పండే భూముల్లో మెట్టపంటలు వేసుకున్నారు రైతన్నలు. పంట దిగుబడులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కనీస గిట్టుబాటు ధర అందడం లేదు. ఈ నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్క పంటకైనా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చిందా? మిర్చి, మినుము, పెసలు, మొక్కజొన్న ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు.
పత్తి పంటనుని తెలుగుదేశం మంత్రులు పందికొక్కుల్లా మేశారు. ప్రతి రైతన్న ముఖ్యమంత్రి హోదాలోని చంద్రబాబును పెద్ద దళారి అంటున్నారు. రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పంటలను కొని.. ఆయన హెరిటేజ్ కంపెనీ నుంచి నాలుగింతలకు వస్తువులను చంద్రబాబు అమ్ముతున్నాడని అంటున్నారు. ఒకవైపు జీఎస్టీ మోతతో షాపుల వాళ్లు తలలు పట్టుకుంటుంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో టీఎస్టీ(తెలుగుదేశం సర్వీస్ ట్యాక్స్) కూడా విధిస్తున్నారు. జన్మభూమి కార్యక్రమం మొదలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థతో ముడిపడిన ఏ పని జరగాలన్నా ఈ టీఎస్టీని చెల్లించాల్సిందే.
నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అయితే ప్రత్యేకంగా మరో ట్యాక్స్ వేస్తున్నారు. అదే కోడెల సర్వీస్ ట్యాక్స్(కేఎస్‌టీ). తోపుడు బండ్లు మొదలు అపార్ట్‌మెంట్ల వరకూ కేఎస్‌టీని వసూలు చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో సత్తెనపల్లిలో అవినీతి జరుగుతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని టీడీపీ నిలబెట్టుకోలేదు. ఏ కులాన్ని, వర్గాన్ని వదలకుండా చంద్రబాబు మోసగించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనంతా మోసం.. మోసం.. అబద్దాలు.. అబద్దాలు. ఆయన ఘనకార్యాలను ప్రజలు, వ్యవస్థ ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి వణకు రావడం ప్రారంభమైంది. దీంతో ఎన్నికల రాజకీయ సూత్రాన్ని బయటకు తీశాడు చంద్రబాబు.
ప్రజలను నమ్మించు.. వంచించు అనేదే చంద్రబాబు రాజకీయ సూత్రం. వారికి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆ నెపాన్ని వేరే వారిపై నెట్టేయ్. అక్కడితో ఆగదా సూత్రం.. ఇందుకోసం తన అనుకూల మీడియాను వాడుకో. బాబు అంటాడు.. ఆయన్ను బలహీనపరచడం అంటే.. రాష్ట్రాన్ని, ప్రజలను బలహీనపరచడం అట. నాకు ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు నైజానికి సంబంధించి ఒక సామెత ఉంది. ఒక దొంగ ఉన్నాడు. తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దొరికిన ఆ దొంగను, ప్రజలు, వ్యవస్థ ప్రశ్నించాయి. నన్ను అరెస్టు చేస్తే మన ఊరికే చెడ్డపేరు అని అన్నాడట ఆ దొంగ. నన్ను బలహీనపరిస్తే ఊరే బలహీనపడుతుందని అన్నాడట ఆ దొంగ. ఇదే కార్యక్రమాన్ని బాబు చేస్తున్నారు. రాజకీయాల్లో పాతాళానికి దిగజారారు చంద్రబాబు.
ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు అంటున్న మాటలు ఆశ్చర్య పరుస్తున్నాయి. ప్రత్యేక హోదా పోరాటానికి ఈయన దిశానిర్దేశం చేస్తాడట. అందుకు అఖిలపక్షాన్ని పిలుస్తాడట. దొంగోడే చివరికి దొంగా.. దొంగా.. అని అరవడం మొదలుపెట్టినట్లుంది. ఇదే పెద్ద మనిషిని మీ ద్వారా అడుగుతున్నా.. మార్చి 2, 2014న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అప్పటి కేబినేట్ ఆమోదించింది. దాన్ని ప్రణాళిక సంఘానికి పంపింది. జూన్‌లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు నెలల పాటు ఆదేశాలు అలానే బల్లపై ఉన్నాయి. ఆ కాలంలో ఆదేశాలను అమలు చేయమని కోరకుండా గాడిదలు కాస్తున్నావా?.
2016 సెప్టెంబర్ 8న అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదాపై ఇవ్వమని చెబితే కృతజ్ఞతలు చెప్పాడు చంద్రబాబు. మరుసటి రోజు అసెంబ్లీలో జైట్లీ ప్రకటనను స్వాగతిస్తూ.. కోడులు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అంటాడు. ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఏం సాధించాయని ఎదురు ప్రశ్నించాడు?. జైట్లీ ప్రకటన అనంతరం టీడీపీ మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించుకుని ఉంటే ఇప్పటికే ప్రత్యేక హోదా వచ్చేది. ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్ సీపీ పోరాటాలు చేస్తే ఈ పెద్ద మనిషి అడ్డుకోలేదా?. మోదీ వస్తున్నారని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా నేను చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేయించారు.
బంద్‌లు చేస్తే.. బలవంతంగా బస్సులు నడిపించారు. యువభేరీలు ఏర్పాటు చేస్తే పిల్లలపై పీడీ యాక్టు పెడతానని బెదిరించారు? ప్రత్యక హోదాపై టీడీపీ నాలుగేళ్లుగా చేసింది ఇది కాదా?. ఈ నెల 16న వైఎస్‌ఆర్ సీపీ అవిశ్వాసం పెట్టకపోతే నువ్వు పెట్టి ఉండే వాడివా బాబు?. అవిశ్వాసానికి మద్దుతు ఇవ్వాలని ప్రతి పార్టీని వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు కలిశారు. మద్దుతు కూడగట్టారు. ఇది చూసిన బాబు 15న తాను చెప్పిన మాట మార్చుకుని ప్రత్యేకంగా తాము కూడా అవిశ్వాసం పెడతామన్నారు. మేం అవిశ్వాసం పెట్టడం వల్లే ఇతర పార్టీలు మద్దుతు ఇచ్చాయని సిగ్గులేకుండా అబద్దాలు చెప్పారు.
ఇటువంటి చిత్తశుద్ది లేని పెద్దమనిషి ఈ చంద్రబాబు. ఇవాళ అఖిలపక్షాన్ని మేం ఎలా నమ్మాలి?. అయ్యా నిన్ను మేం నమ్మం. నీకు చిత్తశుద్ది లేదు. వెన్నుపోటు పొడవడం నీ రక్తం లోనే ఉంది. మేం ఇప్పటికే కార్యాచరణ ప్రకటించాం. ప్రజలలో ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రత్యేక హోదాపై నువ్వు తలొగ్గావు. ఇవాళ రాష్ట్రం గురించి దేశం మాట్లాడుకుంటోంది. చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే పార్లమెంటు సమావేశాల చివరి రోజున మీ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించు.
అదే రోజున వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచన చేయండి. మీకు ఎలాంటి నాయకుడు కావాలని మీరందరూ ఆలోచన చేయండని చెబుతున్నాను. మోసాలు చేసే వారిని పొరబాటునైనా క్షమించొద్దు. అలా చేస్తే రేపొద్దున ఏం జరగుతుందో తెలుసా? చంద్రబాబు మీ దగ్గరికి వచ్చి మైకు పట్టుకుని ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. బోనస్‌గా ఇంటికో బెంజ్ కారు ఇస్తానంటాడు.
ప్రతి ఇంటికి మనిషిని పంపించి మూడు వేలు ఇస్తాడు. మూడు వేలు ఇస్తే ఐదు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మన జేబుల్లో నుంచి దోచేసినదే. కానీ ఓటు వేసేప్పుడు మనస్సాక్షిని నమ్మి వేయండి. అబద్దాలు చెప్పే వాళ్లను, మోసం చేసేవాళ్లను బంగాళాఖాతంలో కలపండి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదం వస్తుంది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే కార్యక్రమాల్లో భాగంగా నవరత్నాలను ప్రకటించాం. వాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తాం. ఆ నవరత్నాల్లో ఈ రోజు అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన హామీల గురించి చెబుతున్నా. పొదుపు సంఘాలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. పూర్తిగా రుణ మాఫీ చేస్తానని చెప్పి వారిని మోసం చేశాడు.
బ్యాంకులకు రుణాలు కట్టొద్దని పిలుపు ఇచ్చాడు. దీంతో అక్కచెల్లెమ్మలు రుణాలు చెల్లించలేదు. ఇవాళ ఆ అక్కచెల్లెమ్మల పరిస్థితి ఏంటి?. వారి వస్తువులను వేలం వేస్తున్నామంటూ బ్యాంకులు నోటిసులు పంపుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వడ్డీ డబ్బులను బ్యాంకులకు కట్టడం లేదు. దీంతో ఎవరికీ బ్యాంకులు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం లేదు. ఆ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చెబుతున్నా.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల వరకూ ఏంతైతే అప్పులు ఉంటాయో వాటన్నింటిని నాలుగు దఫాలు నేరుగా వారి చేతికే ఇస్తాం. పొదుపు సంఘాలకు బ్యాంకుల నుంచి సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. దీనివల్ల ప్రతి అక్కచెల్లెమ్మ లక్షాధికారి కావాలనే వైఎస్‌ఆర్ స్వప్నం సాకారం అవుతుంది.
ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు చెప్పాడు. ఈ నాలుగేళ్లలో ఒక్కరికైనా ఇల్లు కట్టించాడా?. ఆ రోజుల్లో దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు కట్టిస్తే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 48 లక్షల ఇళ్లు కట్టించిన చరిత్ర వైఎస్‌ఆర్‌ది. ఆయన మరణించిన తర్వాత కథ మొదటికి వచ్చింది. ప్రతి అక్కాచెల్లెమ్మకు హామీ ఇస్తున్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించితీరుతాం. ఇల్లు కట్టించి ఆ ఇంటిని అక్కచెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్ చేయిస్తాం. వాటిని అవసరం నిమిత్తం తాకట్టుపెడితే పావలా వడ్డీనే పడేలా చేస్తామని చెబుతున్నా.’
Comments
Please login to add a commentAdd a comment