ఏపీ ప్రజలకు వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ | YS Jagan Open Letter To Andhra Pradesh People | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 10 2018 6:15 PM | Last Updated on Fri, Aug 10 2018 7:33 PM

YS Jagan Open Letter To Andhra Pradesh People - Sakshi

తన సతీమణి వైఎస్‌ భారతిపై ఎల్లో మీడియా అల్లిన కథనాలపై వైఎస్‌ జగన్‌ స్పందించారు.

సాక్షి, హైదరాబాద్‌: తన సతీమణి వైఎస్‌ భారతిపై ఎల్లో మీడియా అల్లిన కథనాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పందించారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు బహిరం​గ లేఖ రూపంలో వివరణయిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు.
 

వైఎస్‌ జగన్‌ లేఖ యథాతథంగా...

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు...

‘‘ఈడీ కేసులో నిందితురాలిగా వైయస్‌ భారతి’’ అంటూ ఈనాడులో, ‘‘ముద్దాయిగా భారతి’’ అంటూ ఆంధ్రజ్యోతిలో ఈరోజు ప్రచురించిన వార్తను చూసి నిర్ఘాంతపోయాను. తనను ఫలానా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు నిందితురాలిగా చేరుస్తున్నారన్న వార్త శ్రీమతి భారతి, నేను ఈ రోజు ఉదయం ఎల్లో పత్రికలు, సెలెక్టివ్‌గా ఒకటి రెండు ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్తను చూసి తెలుసుకోవాల్సి వచ్చింది.

జడ్జీగారు పరిగణలోకి తీసుకున్న తరువాతే చార్జిషీట్‌లో ఏముంది అన్న విషయం మాకైనా, ఎవరికైనా తెలుస్తుంది. అలాంటిది జడ్జిగారు పరిగణలోకి తీసుకోకముందే.. మాకే తెలియకుండా, ఈ విషయం నేరుగా ఈడీ నుంచి కొన్ని పత్రికలకు ఎలా తెలిసింది? ఎవరు వారికి చెప్పారు? మా మీదే బురద చల్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? నా మీదే కాకుండా మొత్తంగా నా కుటుంబ సభ్యుల్ని టార్గెట్‌ చేయాల్సినంతటి శత్రుత్వం ఎవరికి ఉంది? సీబీఐ తన విచారణలో పేర్కొనని కంపెనీలను, వ్యక్తుల్ని ఇన్నేళ్ల తరువాత చార్జిషీట్లలో ఎందుకు చేరుస్తున్నారు? అసలు శ్రీమతి భారతి ఈ కేసులలో సంబంధం ఏమిటి? ప్రతి ఒక్కరూ ఆలోచించండి అని విజ్ఞప్తి చేస్తూ, కొన్ని అంశాలను రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచటం మంచిదన్న అభిప్రాయంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.

నా మీద తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీ కలిసి వేసిన కేసులు 2011 ఆగస్టు 10న ప్రారంభం అయితే నేడు 2018 ఆగస్టు 10. కేసు ప్రారంభమై ఏడేళ్లు గడిచిపోయింది. ఎన్నో చార్జిషీట్లు వేశారు. అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టారు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. మహానేత మరణం తరువాత, మాటకు కట్టుబడి ఓదార్పు చేస్తానన్నందుకు, పెద్దయెత్తున ప్రజాదరణ దక్కుతున్నందుకు తెలుగుదేశం-కాంగ్రెస్‌ కుమ్మక్కు అయి నా మీద కేసులు వేశాయి. ఏడేళ్లుగా ఏటికి ఎదురీదుతున్నా ఏనాడూ భయపడలేదు. సత్యమేవ జయతే అని నమ్మాను కనుకే అన్నింటినీ భరిస్తున్నాను. ఈ రోజు ఎల్లో మీడియా వార్తల్ని బట్టి చూస్తే, శ్రీమతి భారతిని కూడా కోర్టు చుట్టూ తిప్పాలని కంకణం కట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ తరుపున ఎల్లో మీడియా సంబరపడుతోంది.

ఇంతకు ముందునుంచి జరుగుతున్న కొన్ని విషయాలను క్లుప్తంగా చెప్పాలి. ఉమాశంకర్‌ గౌడ్‌, గాంధీ.. ఈ ఇద్దరూ మమ్మల్ని ఏ స్థాయిలో వేధిస్తున్నారో 2017 ఫిబ్రవరిలో, అంటే దాదాపు 17నెలల క్రితం భారత ప్రధానిగారికి లేఖ ద్వారా తెలియజేశాం. ఆ అధికారుల కాల్‌ డేటా మీద దర్యాప్తు చేసినా, వారికి చంద్రబాబుగారి సహచరులతో ఉన్న సంబంధాల మీద దర్యాప్తు చేసినా... ఆ ఇద్దరూ నా మీద, నా కుటుంబం మీద చంద్రబాబు ప్రయోగించిన ప్రత్యేక ఆయుధాలన్న విషయం రూఢి అవుతుంది. ఇందులో గాంధీ అనే అధికారి బదిలీ అయినా, ఉద్యోగం నుంచి రిలీవ్‌ కాకుండా అసాధారణంగా ఆయన మూడుసార్లు తన పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు. ఈ పొడిగింపును కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. ఇప్పుడు ఆ అధికారుల చేతే టీడీపీ వారు మామీద కక్ష సాధింపు రిపోర్టుల్ని రాయించారని స్పష్టమవుతోంది.

ఇవన్నీ గమనించిన తరువాత ... బీజేపీతో కుమ్మక్కు అయింది ఎవరు? బీజేపీ - టీడీపీల చీకటి వ్యవహారాల్లో బాధితులెవరు అన్నది రాష్ట్ర ప్రజలకు మరింతగా స్పష్టమవుతుంది. చంద్రబాబుగారు బురద చల్లుతున్నదానిలో వాస్తవమే ఉంటే, అంటే బీజేపీ మాకూ అంత సత్సంబందాలే ఉంటే, ఈ విషయం ఇంత దూరం వచ్చేదా? అసలు ఈ కేసులతో ఏ సంబంధమూ లేని నా భార్యను కూడా కక్ష పూరితంగా- అదీ ఏడేళ్ల తరవాత ఈడీ వారు చార్జిషీట్‌లో పెట్టి ఉండేవారా? పగలు కాంగ్రెస్‌తో కాపురం... రాత్రికి బీజేపీతో సంసారం... ఇదీ ఇప్పుడు చంద్రబాబు నడుపుతున్న రాజకీయం! ఈ తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా, నామీద కేసుల విషయంలో భయపడకుండా, రాజీపడకుండా.. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ పోరాటం నుంచి ప్రత్యేక హోదా పోరాటం వరకు ధైర్యంగా రాష్ట్ర సమస్యల మీద ఉద్యమించాం తప్ప కాడి అవతల పారేయలేదు... లాలూచీ ఆలోచనలు చేయలేదు. తెర వెనుక రాజకీయాలు చేతగావు.

మరోవంక, లాలూచీ రాజకీయాలకు పెట్టినది పేరు అయిన చం‍ద్రబాబు నాయుడు వ్యవహారాన్ని చూడండి... ‘‘ చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నా మా మిత్రుడే’’ అని కేంద్రం హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కేంద్ర రక్షణ మంత్రిగారి భర్త చంద్రబాబు కొలువులో సభ్యుడు. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్య మన టీడీపీ బోర్డులో చం‍ద్రబాబు నియమించుకున్న సభ్యురాలు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ షూటింగ్‌ జరుగుతుంటే, బాలకృష్ణ పక్కనే కుర్చీలో కూర్చుని సాక్షాత్తు వెంకయ్యనాయుడు గారు కనిపిస్తారు.

బీజేపీ బంధాలు, సంబంధాలు అలాగే ఉన్నాయి కాబట్టే, ఓటుకు కోట్లిస్తూ ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా దొరికిపోయినా, సుప్రీంకోర్టు సమన్లున్నా, దేశంలో నంబర్‌వన్‌ అవినీతి ప్రభుత్వాధిపతి ఆయనే అని ఎన్ని సంస్థలు చెబుతున్నా.. ఈ పెద్దమనిషి రొమ్ము విరుచుకుని తిరగగలుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అవినీతి ప్రదేశ్‌గా మార్చారని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌), సెంటర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌), ఆమ్నెస్టీ ఇంటర్‌నేషనల్‌ వంటి స్వచ్చంధ సంస్థలు తమ నివేదికల్లో బయట పెట్టాయి. ఇక కాగ్‌ నివేదికల్లో చంద్రబాబు కొండంత అవినీతి సంగతులు అన్నీ కాకపోయినా, కొన్ని అయినా ప్రస్తావనకు వచ్చాయి. ఇవన్నీ విచారణ జరగాల్సిన అంశాలే. అయినా ఇందులో ఏ ఒక్కఅంశం మీదా ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా బాబుమీద విచారణ జరగటం లేదంటే.. చంద్రబాబు రెండు జాతీయ పార్టీల్నీ పగలూ రాత్రీ పద్దతిలో ఎంతగా మేనేజ్‌ చేస్తున్నాడో, అత్యున్నత వ్యవస్థల్లో తన మనుషుల్ని ఏ స్థాయిలో పెట్టుకుని ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా మార్చి చూపుతున్నాడో అర్థమవుతోంది.

ప్రజలకు మంచి చేసి కాకుండా వ్యవస్థల్ని మేనేజ్‌చేసి.. ‘ప్రత్యర్థిపక్షాన్ని’ ప్రజల్లో ఎదుర్కోలేక వ్యవస్థల ద్వారా దెబ్బతీసి.. అధికారంలో కొనసాగాలనకుంటున్నాడు కాబట్టే చంద్రబాబు ముందుగా నా తండ్రిగారిని టార్గెట్‌ చేశాడు. తరువాత నన్ను టార్గెట్‌ చేశాడు. ఇప్పుడు నా భార్య శ్రీమతి భారతిని తన మనుషులతో టార్గెట్‌ చేయిస్తున్నాడు. ఇలాంటి వ్యవహారాల్ని ఆమోదిస్తే ఇక ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉంటుంది? ప్రజాస్వామ్యం ఎక్కడ బతికి ఉంటుంది? రాజకీయాలంటే ఛీ అని ఎవరికైనా అనిపించదా? అందరూ ఆలోచించండి?

ఇట్లు
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

వైఎస్‌ జగన్‌ రాసిన బహింగ లేఖ పూర్తి పూఠం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement