
సాక్షి, గజపతినగరం(విజయనగరం) : ‘గత వారం రోజులుగా మున్సిపాలిటీల్లో చెత్త పేరుకు పోయి, విష జ్వరాలు వ్యాపిస్తున్నా పట్టించుకోని చంద్రబాబు నాయుడికి ఉత్తమ చెత్త ముఖ్యమంత్రి అవార్డు ఇవ్వాలి’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఆయన చెత్త పాలనకు ఆ అవార్డే సరైందని ఎద్దేవా చేశారు. 283వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గజపతినగరం బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సభలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
తోటపల్లి పూర్తయ్యేనా... ?
గజపతినగరంలో తిరుగుతున్నపుడు రైతన్నలు తనని కలిసి అర్జీలు ఇచ్చారన్న వైఎస్ జగన్.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కంటే ముందు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏనాడు తోటపల్లి ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఆయనకు ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాను సందర్శించిన రాజన్న.. అధికారంలోకి వచ్చాక తోటపల్లి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. ఆయన హాయంలోనే ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని... కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లైనా మిగిలిన 10 శాతం పనులు పూర్తి కాలేదని విమర్శించారు. రైతుల బాగోగులు పట్టించుకోకుండా చంద్రబాబు గాడిద పళ్లు తోముతున్నారా అంటూ జగన్ ఎద్దేవా చేశారు. 20 మండలాల్లో లక్షా ముప్పై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా పనుల జాప్యం వల్ల కేవలం ఎనభై వేల ఎకరాలకు కూడా అందండం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో బ్రాంచు కెనాల్‌కు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 25 శాతం పనులు పూర్తి చేస్తే.. చంద్రబాబు 9 కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకొన్నారన్నారు. ఇలా అయితే తోటపల్లి ఎప్పుడు పూర్తవుతుందని జగన్ ప్రశ్నించారు.
100 పడకలకు పెంచే హామీ ఏమైంది..?
ఆరుగురు డాక్టర్లు ఉండాల్సిన సామాజిక ఆస్పత్రిలో కేవలం నలుగురు మాత్రమే ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని జగన్ అన్నారు. అధికారంలోకి వస్తే 100 పడకలకు పెంచుతామన్న బాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. ‘ జగన్ చీపురుపల్లి దాటాడని తెలిసిన తర్వాత గైనకాలజిస్టును నియమించారు. పిల్లల డాక్టరు లేరు. బ్లడ్ బ్యాంకు లేదు. మార్చురీలో ఫ్రీజర్లు లేవు. జనరేటర్ పనిచేయదు. అంబులెన్సులు లేవు. ఇలా అయితే పేదవారికి వైద్యం ఎలా అందుతుందంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
108 వాహనాల కొనుగోలులో అడ్డగోలు అవినీతి
రాష్ట్రంలో వాస్తవంగా 310 అంబులెన్సులు(108 వాహనాలు) ఉంటే.. సీఎం దగ్గర ఉన్న కోర్ డ్యాష్ బోర్డులో మాత్రం 414 వాహనాలు తిరుగుతున్నాయంటూ లెక్కలు చూపిస్తున్నారని జగన్ అన్నారు. అలాగే ఒక్కో వాహనం కొనుగోలు చేయడానికి టాటా కంపెనీ 12.60 లక్షలు కోట్ చేస్తే.. చంద్రబాబు మాత్రం 18 లక్షల రూపాయలు చెల్లించి తన బినామీలకు లబ్ది చేకూరుస్తున్నారని జగన్ ఆరోపించారు. పక్క రాష్ట్రం తెలంగాణలో 11 లక్షల 65 వేలకే 108 వాహనం కొనుగోలు చేస్తుంటే.. బాబు ఇంత మొత్తం ఖర్చు చేయడం ఆయన అవినీతికి నిదర్శనమన్నారు. ఆఖరికి 108 వాహనాల డీజిల్‌కు కూడా చెల్లించాల్సిన డబ్బుల విషయంలో కూడా చంద్రబాబు స్కాం చేయడం సిగ్గుచేటని జగన్ విమర్శించారు.
బాబుకు ఉత్తమ కరువు రత్న అవార్డు..
వ్యవసాయం దండుగ, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని రైతన్నను అవమానించిన చంద్రబాబు నాయుడికి అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం రావడం హాస్యాస్పదంగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. బాబుకు ఈ అవార్డు రావడం చూస్తుంటే రోజూ తాగొచ్చి భార్యను కొట్టే భర్తకు ఉత్తమ భర్త అవార్డు ఇచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బాబు అధికారంలోకి వస్తే కరువు కూడా వస్తుందని అందుకే ఆయనకు ఉత్తమ కరువు రత్న అవార్డు, చెత్తగా పాలిస్తున్నందుకు చెత్త సీఎం అవార్డు, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నిద్ర పోతున్నందుకు కలియుగ కుంభకర్ణ అవార్డు ఇవ్వాలన్నారు. కరువును జయించానని బొంకుతున్న బాబు అధికారంలోకి రాగానే సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని, పంట దిగుబడి కూడా తగ్గిందని జగన్ విమర్శించారు.
జగన్ అనే నేను రైతుల కోసం...
తాము అధికారంలోకి వస్తే రైతు సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాల గురించి జగన్ వివరించారు.పెట్టుబడి తగ్గితే రైతన్న ఆదాయం పెరుగుతుందన్న జగన్.. నవరత్నాల్లో భాగంగా ప్రతీ రైతుకు పెట్టుబడి సాయంగా 12, 500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. మే నెలలోనే ఈ మొత్తాన్ని అందజేస్తామని, అదే విధంగా క్రాప్‌లోన్ల ద్వారా వడ్డీ రుణాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా పంట వేయడానికి ముందే ముందే ప్రతీ పంటకు ధరను నిర్ణయించి ధరలస్థిరీకరణ కింద 3 వేల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే అవసరాన్ని బట్టి ప్రతీ మండలంలో కోల్డేజీ స్టోర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతామని జగన్ హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ లేకుండా చూస్తామన్నారు. అక్వా రైతుల కోసం కరెంటు యూనిట్‌కు రూపాయిన్నర చొప్పున తగ్గిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా రైతు ఆత్మహత్యలు నివారించడానికి వైఎస్సార్ భీమా పేరిట ఒక్కో రైతుకు 5 లక్షల రూపాయల భీమా కల్పిస్తామన్నారు. ఈ సొమ్ముపై అప్పుల వాళ్లకు హక్కు లేకుండా ఉండేందుకు అసెంబ్లీలో చట్టం కూడా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment