పూర్ణామార్కెట్ సమీపంలోని దుర్గాలమ్మ గుడి వద్ద బహిరంగసభలో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల
విశాఖసిటీ: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల విశాఖలో సోమవారం ఎన్నికల ప్రచార పర్యటన చేసిన ప్రాంతాల్లో జనకెరటాలు ఎగిసి పడ్డాయి. రాజన్న ముద్దు బిడ్డ.. జగనన్న సోదరి ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన ప్రజలతో దారులన్నీ జనదారులైపోయాయి. ఎన్‌ఎడీ జంక్షన్ నుంచి ప్రారంభమైన రోడ్ షోలో షర్మిలను చూసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున రహదారికిరువైపులా బారులు తీరుతూ తిరునాళ్లను తలపించాయి. పండగ వాతావరణాన్ని తలపించే విధంగా.. పశ్చిమ నియోజకవర్గంలో రోడ్ షో ప్రారంభమైన దగ్గరి నుంచి ఉత్తర నియోజకవర్గం మీదుగా... దక్షిణ నియోజకవర్గంలోని పూర్ణా మార్కెట్ దుర్గాలమ్మ గుడి వద్ద జరిగిన ముగింపు బహిరంగ సభ వరకూ ఆమె వెంటే వస్తూ అభిమానాన్ని చాటుకున్నారు.
మూడు చోట్లా అదే ఉత్సాహం
మూడు నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించిన షర్మిల రెండు చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. పశ్చిమలో కంచరపాలెం మెట్టు, దక్షిణలో దుర్గాలమ్మ గుడి సెంటర్ వద్ద జరిగిన ప్రచార సభలో వైఎస్ షర్మిల ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వం సాగించిన అరాచకాలు, చంద్రబాబు హయాంలో సాగిన అమానవీయ ఘటనల గురించి వివరిస్తూ.. ఐదేళ్ల కాలంలో చంద్రబాబు అండ్ కో వెలగబెట్టిన అవినీతి ఘనకార్యాల్ని ప్రజలకు వివరించిన సమయంలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఏ ఒక్క ఎన్నికలోనూ గెలవకుండానే అడ్డదారిలో మూడు శాఖలకు మంత్రి పదవులు దక్కించుకున్న నారా లోకేష్ అలియాస్ పప్పు అనగానే.. ప్రజల హోరుతో మార్మోగిపోయింది. మహిళలపై అరాచకాలు జరుగుతున్నా.. పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు అన్నగా నిలబడతానని ఏ మొహం పెట్టుకొని చెబుతున్నారో ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విశాఖలో నడి రోడ్డుపై పేద మహిళపై అత్యాచారం జరిగినప్పుడు, పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసి చిత్ర హింసలకు గురి చేసినప్పుడు చంద్రబాబులో ఉన్న అన్న ఏమయ్యారని షర్మిల ప్రశ్నించారు.
దొంగబాబుకు బైబై చెబుదాం..
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. యూటర్న్ తీసుకొని ప్రజల్ని మోసం చెయ్యడం తప్ప.. చంద్రబాబుకు సంక్షేమం, అభివృద్ధి గురించి అస్సలు తెలియవని షర్మిల చురకలంటించారు. సింహంలా సింగిల్‌గా వస్తున్న జగనన్నను ఎదుర్కోలేక.. నక్కల గుంపులా పవన్ కల్యాణ్, రాహుల్‌గాంధీ, మమతాబెనర్జీ, కేజ్రీవాల్, దేవెగౌడ.. ఇలా ఎవరు దొరికితే వారిని వెంటబెట్టుకొని వస్తూ దొంగ నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. 650 హామీల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబుకు ఓటెయ్యాలో చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన చంద్రబాబు మీ ఇంటిలో ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా అని ప్రజల్ని షర్మిల ప్రశ్నించగానే.. వేల గొంతుకలు లేదు.. లేదు అని నినదించాయి. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఎవరికీ హామీ నెరవేర్చకుండా కాలం గడిపేశారని వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఒక్క పైసా కూడా తీర్చకుండా..
ఎన్నికలు వస్తున్నాయనగానే పసుపు కుంకుమ పేరుతో డబ్బులిస్తున్నారనీ, ఆ డబ్బులు.. రుణమాఫీ చేస్తారని చెల్లించని అప్పునకు వడ్డీ తీర్చేందుకు కూడా సరిపోదన్నారు. మళ్లీ రాజన్న పాలన రావాలన్నా.. చెప్పినవి, చెప్పనివి కూడా చేసే ముఖ్యమంత్రి కావాలన్నా.. ప్రతి ఇల్లూ.. సంక్షేమంతో కళకళలాడాలన్నా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనందరిపైనా ఉందని షర్మిల పిలుపునిచ్చారు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ ఇప్పుడు వస్తున్న దొంగబాబు చంద్రబాబు మాట ఒకటైతే.. మనసులో మాత్రం లోకేష్ భవిష్యత్తు నా బాధ్యత అని ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి తండ్రీ కొడుకుల్ని సాగనంపే ప్రజాతీర్పు బైబై బాబు.. బైబై లోకేష్ అంటూ షర్మిల అనగానే.. పెద్ద ఎత్తున ప్రజలు బైబై బాబు.. బైబై బాబూ.. అంటూ నినాదాలు చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మళ్ల విజయ్‌ప్రసాద్, ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కెకె రాజు, దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్‌ను గెలిపించాలనీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment