‘బాబూ’ అసలు నీకు సిగ్గుందా? | YSR Congress Leaders Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘బాబూ’ అసలు నీకు సిగ్గుందా?

Published Tue, Jan 29 2019 3:53 AM | Last Updated on Tue, Sep 3 2019 8:53 PM

YSR Congress Leaders Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి/హైదరాబాద్‌ : తెలంగాణాలో బీసీ కులాలను అక్కడి సీఎం కేసీఆర్‌ తొలగించారని చెబుతున్న చంద్రబాబు ఈ విషయమై ఏనాడైనా ఎవరికైనా ఒక లేఖ అయినా రాశారా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌తో తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి కుమ్మక్కయ్యారంటావా అని చంద్రబాబును నిలదీశారు. నిజంగా తెలంగాణాలో కేసీఆర్‌ బీసీ కులాలను తొలగించి ఉంటే ఆ విషయంపై కేసీఆర్‌కు కనీసం లేఖ రాశావా? వారిని తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని గవర్నర్‌ను అయినా కోరావా? అని ఆయన ప్రశ్నించారు.

నాలుగున్నరేళ్లలో అనేక పర్యాయాలు కేసీఆర్‌ను కలిసిన చంద్రబాబు ఆయనను ఏమాత్రం ప్రశ్నించకుండా, కేటీఆర్‌ కేవలం ఒకసారి జగన్‌మోహన్‌రెడ్డిని కలిస్తే అనవసరంగా నిందలేస్తావా అని మండిపడ్డారు. తమ పార్టీ అధినేత జగన్‌ ఇచ్చిన హామీలన్నింటినీ బాబు కాపీ కొడుతున్నారని ఆక్షేపించారు. ఇలాంటి కాపీమాస్టర్‌ మరెక్కడా కనబడరని విమర్శించారు. ప్రతీ బీసీ కులానికి కార్పోరేషన్‌ ఏర్పాటుచేస్తామని జగన్‌ ప్రకటించారన్నారు. టీటీడీలో సన్నిధి గొల్లలు పదవిని లేకుండా చేసి అవమానిస్తే దానిని జగన్‌ సరిదిద్దుతానని హామీ ఇచ్చారన్నారు. బీసీల పట్ల చంద్రబాబుకు ఏమాత్రం ప్రేమలేదని, బీసీలపై ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలోనే మొసలికన్నీరు కారుస్తున్న విషయాన్ని బీసీలు గమనించాలన్నారు.   

దగా చేసేందుకే జయహో బీసీ : పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
రాష్ట్రంలోని బీసీ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  ఆయన మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు మరో 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని మరోమారు మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. రాజమండ్రిలో హడావుడిగా జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ కులాలకు కార్పొరేషన్లు పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ప్రతి ఏటా బడ్జెట్‌లో బీసీలకు  రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి.. ఐదేళ్లలో కేవలం రూ.14 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, అది కూడా పూర్తిగా ఖర్చు చేయలేదని చెప్పారు.  

చేనేత పరిశ్రమకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్న చంద్రబాబు ఎక్కడా అమలు చేయలేదన్నారు. నూలు కొనుగోలుపై సబ్సిడీ, హ్యాండ్‌లూమ్‌ విక్రయాలపై 30 శాతం రాయితీలు ఇస్తామని  పట్టించుకోలేదని విమర్శించారు. పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో..కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు.  కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement