
కుంటిభద్ర వద్ద నీటమునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్న రెడ్డి శాంతి
శ్రీకాకుళం, కొత్తూరు: వంశధార, నాగావళి నదులు ఉప్పొంగడంతో జిల్లాలోని నదీతీర ప్రాంతాల్లో వరి, కూరగాయలతో పాటు పలు రకాల పంటలకు నష్టం వాటిల్లిందని, బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.30 వేలు చొప్పున పరిహారం అందజేయాలని కోరారు. ఆదివారం కొత్తూరు మండలం కుంటిభద్రతో పాటు పరిసర గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏటా వరదల కారణంగా నదీ తీర ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నా బాధిత రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన ఫిరాయింపు ఎమ్మెల్యేకు లేకపోవడం దారుణమన్నారు.
గత ఏడాది సంభవించిన వరద నష్టానికి ఇప్పటికీ పరిహారం అందించకపోవడం శోచనీయమన్నారు. ఇసుక ర్యాంపులు, నీరు–చెట్టు పనులు, మందుగుండ సామాన్ల నిల్వల అనుమతులు కోసం చూపించిన శ్రద్ధ వరద బాధిత రైతులపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ నేతలకు స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని దుయ్యబట్టారు. తాజా వరదలో నీటమునిగిన పంటపొలాలపై సర్వే చేసి బాధిత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఏటా పంట నీటమునగడంతో తీవ్రంగా నష్టపోతూ అప్పుల్లో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వరద గట్లు నిర్మించకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురిస్తోందని వాపోయారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అగతమూడి నాగేశ్వరరావు, పంకజదాస్, మాజీ ఉప సర్పంచ్ ఎద్దు హరిదాసు, ఆఫీసు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment