సాక్షి, విజయవాడ : పాత బండికి కొత్త డ్రైవర్ వచ్చినట్లుగా..లోక్‌సత్తా పార్టీకి కొత్త అధ్యక్షుడిగా జేడీ లక్ష్మీనారాయణ వచ్చారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. నీతి, నియమాల గురించి మాట్లాడే లోక్‌సత్తా నాయకులు.. ఈ నాలున్నరేళ్ల చంద్రబాబు అవినీతిపై, కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ తదిరత అంశాలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం పుట్టిన కవలల్లో ఒకటి లోక్‌సత్తా పార్టీ కాగా, మరొకటి జనసేత పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు అనేసరికే చంద్రబాబుకు అన్ని పథకాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పట్టిసీమ నుంచి రాయలసీమ వరకూ అణువణువు దోచుకున్నారని ఆరోపించారు.
చంద్రబాబు అవినీతిని ప్రశ్నించకుండా పవన్ కల్యాణ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. వైఎస్సార్‌ను, వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నాకూడా అసెంబ్లీలో పోరాడుతానంటున్న పవన్.. గత ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదో చెప్పాలన్నారు. అసెంబ్లీలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేయడానికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించామని చెప్పారు. అన్యాయంగా 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎత్తుకెళ్తే పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రజల కోసం ధైర్యంగా పోరాడుతున్న ఎకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ప్రజల ఆశిస్సులతో అధికారంలోకి వచ్చేది కూడా తమ పార్టీయేనని అంబటి ధీమా వ్యక్త చేశారు.
Comments
Please login to add a commentAdd a comment