
మూడు పార్టీల సభ అట్టర్ ప్లాప్.. ప్రధాని హాజరైన సభను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
సాక్షి, సత్తెనపల్లి: మూడు పార్టీల సభ అట్టర్ ప్లాప్.. ప్రధాని హాజరైన సభను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 2014లో ఇదే కూటమి కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చింది.. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎంత ఆగం చేశారో అందరికీ తెలుసు అంటూ మండిపడ్డారు.
‘‘నాడు విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్నారు. ప్రధానిని ఆనాడు చంద్రబాబు ఏమన్నారో ప్రజలకు గుర్తుంది. పొరపాటున ఓటు వేసిన పాపానికి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. ప్రజాగళం ఏం సందేశం ఇచ్చింది?. ముగ్గురు కలిసి పోటీ చేసినా సీఎం జగన్‌ను ఓడించలేరు. చంద్రబాబు జీవితమంతా అభద్రతాభావంతో బతుకుతున్నారు. ప్రజాగళం సభలో మైక్ మూగబోయింది. మైక్ కూడా సరిచేసుకోని వారు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు?’’ అంటూ ప్రశ్నించారు.
‘‘సీఎం జగన్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సీఎం జగన్ పరుగులు పెట్టించారు. సీఎం జగన్ సభలకు ప్రజలు తరలివస్తున్నారు. ఆ మూడు పార్టీల సభలను జనం పట్టించుకోవడం లేదు. పవన్‌తో కాదని తెలిసి మోదీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు అండ్‌కో ఎంత బురదజల్లినా ప్రజల గుండెల్లో ఉన్న జగన్‌ను ఏమీ చేయలేరు’’ అని మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: నారా లోకేష్‌పై టీడీపీలో కొత్త చర్చ.. అసలేం జరుగుతోంది?