
సాక్షి, విజయవాడ : తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీ నాయకులు ఓటమి బాధ్యతను తోసేయకుండా పునరాలోచన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి హితవు పలికారు. టీడీపీ ఓటమికి కార్యకర్తలు, నేతలదే బాధ్యత అని మాజీమంత్రి లోకేశ్ వ్యాఖ్యానించడం పట్ల ఆయన విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే అది చంద్రబాబు గెలుపు అని.. నేడు ఓడిపోతే కార్యకర్తలు, నేతలే కారణమని చెప్పడం లోకేశ్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. 2009 ఎన్నికల సందర్భంగా విజయమైనా.. ఓటమైనా తనదే బాధ్యత అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. లోకేశ్, చంద్రబాబు పిరికిపందలని అన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
(చంద్రబాబును టీడీపీ నేతలే మోసం చేశారు: లోకేష్)
అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నామని ప్రకటించిన చోటనే చంద్రబాబుకు ప్రజలు తగిన బుధ్ది చెప్పారని అన్నారు. ఏం పని చేసినా.. చివరికి ప్రజల సౌకర్యార్థం రోడ్డువేసినా తామే చేశామని, పెన్షన్ ఇచ్చినా తామే ఇచ్చామని అహంకారపూరిత ధోరణితో మాట్లాడిన టీడీపీ నేతలకు ప్రజలు తగిన శాస్తి చేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ యుగపురుషుడు అని చెప్పిన చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడిచారని.. ఇవన్నీ ప్రజలు మరచిపోతారనకుంటే పొరపాటే అవుతుందని పార్థసారథి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైద్రాబాద్‌లోని ఎన్టీఆర్ సమాధిని అలంకరించలేని దయనీయ పరిస్దితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థికభారం పడకుండా ప్రమాణస్వీకారం..
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం అదించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు. 50 శాతం ఓట్లతో విజయం ఆషామాషిగా వచ్చింది కాదు. వైఎస్ జగన్ ప్రజలతో మమేకం అయ్యారు. ప్రజల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేశారు. 14 నెలలపాటు మూడువేల ఆరు వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ఇద్దరితో ప్రారంభమైన వైఎస్సార్‌సీపీ నేడు ప్రజాభిమానంతో అధికారంలోకి చేరుకుంది. టీడీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దుష్పరిపాలనను గుర్తించని ఎల్లోమీడియా నేడు వైఎస్ జగన్ వ్యాఖ్యల్ని వక్రీకరించాలని చూస్తోంది. గెలిచిన మరుక్షణం రాష్ట్రానికి మేలు చేయాలనే ఉధ్దేశంతో ఆయన తెలంగాణ సీఎం కేసిఆర్‌తో నదీజలాల గురించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్దితిని గురించి వివరించారు. సహాయం కోరారు.
కానీ, కొన్ని మీడియా సంస్థలు కేంద్రంతో యుద్ధం ప్రకటించాలని ప్రచారం చేస్తున్నాయి. ముందు మేం రిక్వెస్ట్ చేస్తాం...అని ప్రకటిస్తే అడుక్కోవడం అని వక్రీకరించారు. వైఎస్ జగన్ పోరాట పటిమ రాష్ట్ర్ర ప్రజలకు తెలుసు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించే విషయంలో ఆయన చిత్తశుద్దితో ఉంటారని అందరికీ తెలుసు. కేవలం రాజకీయ శక్తిగా ఎదగాలనేకాదు.. ప్రజలకు మేలైన పరిపాలన అందించి వారి హృదయాల్లో స్థానం సంపాదించాలన్నది వైఎస్ జగన్ ఆకాంక్ష. అవినీతికి అడ్డుకట్ట వేసి రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకు తీసుకువెళ్లే బృహత్తర బాధ్యతను ఆయన తలకెత్తుకున్నారు. ప్రతి పైసా సద్వినియోగం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. చంద్రబాబు ప్రజల సొమ్ముతో ధర్మపోరాట దీక్షలు నిర్వహించి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారు. కానీ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా.. ప్రభుత్వంపై ఆర్థికభారం పడకుండా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 30 (గురువారం)న మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు’ అని పార్థసారథి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment