
సాక్షి, హైదరాబాద్ : ‘వ్యవసాయం దండగ.. వరి సోమరి పంట’ అన్న సీఎం చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్యసమితి సదస్సులో అదే అంశంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ఎద్దేవా చేశారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా కల్పించని చంద్రబాబు వ్యవసాయంపై ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు మంత్రులపై నమ్మకం సన్నగిల్లిందా అని ప్రశ్నించారు.
విధానపరమైన అంశాలపై మంత్రులు సమాధానం చెప్పాలి, కానీ ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెప్పడమేంటని మండిపడ్డారు. సీఆర్‌డీఏ 10.75 శాతంకు రెండు వేల కోట్ల రూపాయలు సేకరించి గొప్పలు చెబుతుందని విమర్శించారు. 10.50 శాతం కన్నా తక్కువ వడ్డీకి అప్పులు తేగలరా అని కుటుంబరావు సవాల్ చేస్తున్నారని, ఈ సవాల్‌కు తాము సిద్దమని పార్థసారథి స్పష్టం చేశారు. కుటుంబరావు స్థాయి మరిచిపోయి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో కుటుంబరావు ఉన్నాడని అనుమానం కలుగుతుందన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణంలో ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగలేదన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment