పథకాలన్నీ దళారులకే! | ysrcp leader rachamallu fires on tdp leaders zp meeting | Sakshi
Sakshi News home page

పథకాలన్నీ దళారులకే!

Published Fri, Feb 16 2018 12:42 PM | Last Updated on Fri, Aug 10 2018 8:46 PM

ysrcp leader rachamallu fires on tdp leaders zp meeting - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి

కడప ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం రైతుల కోసం ఇచ్చే సబ్సిడీ పథకాల వల్ల రైతుల కంటే దళారీలకే ఎక్కువ మేలు జరుగుతోందని, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా రైతు ఖాతాల్లో జమచేస్తే మరింత మేలు జరుగుతుందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితోపాటు మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘనామిరెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక జెడ్పీ సమావేశం హాల్‌లో గురువారం సీఈఓ రామచంద్రారెడ్డి అధ్యక్షతన జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి ఆధ్వర్యంలో 13వ జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు అవినాష్‌రెడ్డి, రమేష్‌నాయుడు, ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘరామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలు ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌రవి)లతోపాటు కలెక్టర్‌ బాబురావునాయుడు, జేసీ శ్వేత, ట్రెనీ ఐపీఎస్‌ వకుల్‌ జిందాల్‌ హాజరయ్యారు.

ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టిన జెడ్పీ చైర్మన్‌
సభ ప్రారంభం కాగానే జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతోపాటు రాయలసీమలో హైకోర్టుకు ఏర్పాటుకు సంబంధించి తీర్మానాలను ప్రవేశపెట్టగా జెడ్పీటీసీ సభ్యుడు పొరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇది ఎంతో ప్రాధాన్యత ఉన్న అంశం, సభలో చర్చించిన తర్వాత తీర్మానం చేస్తే బాగుంటుందని అనగా చైర్మన్‌ అలాగేనన్నారు.  5 విడత జన్మభూమికి సంబంధించి ఇళ్లు, పింఛన్లు, ఇంటిస్థలాలతోపాటు పలు సమస్య కోసం వచ్చిన అర్జీలు ఎన్ని, వాటి పరిష్కారం కోసం మీరు తీసుకున్న చర్యలేవని సీపీఓను అడిగారు. 3,97,145 అర్జీలు వచ్చాయని వీటిలో 3.96లక్షల అర్జీలను ప్రాసెస్‌ చేశామన్నారు. ఇందులో 2.63లక్షల అర్జీలు డబ్బులతో ముడిపడిన అంశాలని చెప్పారు. దీనిపై సంతృప్తి కరమైన సమాధానం రాకపోవడంతో ఎమ్మెల్యే రాచమల్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేవలం 260మందికి ఇళ్ల స్థలాలుఇస్తే సరిపోతుందా?
ప్రొద్దుటూరులో 70వేల మంది ఓటర్లు ఉంటే ఇందులో 3,579 మంది ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకోగా మీరు 260 మందికి మాత్రమే ఇచ్చారని, మిగిలిన వారి పరిస్థితేంటో వివరించాలని ఎమ్మెల్యే రాచమల్లు పట్టుబట్టారు. కొత్తపల్లె పంచాయతీలో 2006–07లో వైఎస్సార్‌ 8 వేలమందికి ఇళ్లస్థలాలను మంజూరు చేశారు. 4 వేలమంది ఇళ్లు కట్టుకున్నారు. 2వేల మంది పునాదులు వేసుకున్నారు. అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించకపోవడంతోనే వారు మందుకు రాలేదన్నారు. ఇప్పుడా స్థలాలను ఇతరులకు కేటాయిస్తామని అధికారులు చెప్పడం సరైనది కాదని మండిపడ్డారు. అలా చేస్తే వారి తరపున పోరాటం చేయాల్సి ఉంటందని హెచ్చరించారు. కలెక్టర్‌ ఈ అంశంపై స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.  చాపాడు జెడ్పీటీసీ నరసింహారెడ్డి మాట్లాడుతూ 2015 నవంబర్‌లో కురిసిన వర్షాలకు మినుము, పెసర పంటలు దెబ్బతిన్నాయని, నష్టపరిహారం ఇంతవరకూ రాలేదన్నారు. దీనికి జేడీ స్పందిస్తూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని వస్తాయన్నారు.

గాలివీడు జెడ్పీటీసీ లక్ష్మీదేవి మాట్లాడుతూ గాలివీడు బస్టాండ్‌కు సర్పంచ్‌ స్థలం ఇస్తే ఆర్టీసీ వారు అక్కడ రూములు నిర్మించుకుని బాడుగలు తీసుకుంటున్నారు తప్పా మహిళలకు కనీసం మరుగుదొడ్లను కూడా నిర్మించలేదన్నారు. ఒక పక్క ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ అని మొత్తుకుంటున్నా మహిళలకు వారిచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. అలాగే గాలివీడులో జెడ్పీ బాలికల పాఠశాలకు అన్ని వసతులు ఉన్నా ప్రైవేటు పాఠశాలకు పదవ తరగతి సెంటర్‌ను ఇచ్చారు.. ఇదేనా ప్రభుత్వ విద్య బలోపేతంపై ఉన్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. దీనికి డీఈఓ స్పందిస్తూ ప్రభుత్వ పాఠశాలకు ప్రహారీ లేని కారణంగా సెంటర్‌ను వేయలేదన్నారు. దీనికి ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి స్పందిస్తూ ఇతర జిల్లాలో జెడ్పీ నిధులతో ప్రహారీలు నిర్మిస్తున్నారని తెలిపారు. దీనికి స్పందించిన జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి జిల్లాలో ప్రహరీలు లేని బాలికల జెడ్పీ హైస్కూల్స్‌ ఉన్నాయని, వాటి జాబితాను ఇవ్వాలని డీఈఓను ఆదేశించారు. వేసవిలో మంజూరు చేస్తామన్నారు.

సబ్సిడీ మొత్తాన్ని రైతు ఖాతాకే జమ చేయాలి : ఎంపీ అవినాష్‌రెడ్డి
‘ప్రభుత్వం ççసబ్సిడీ కింద ఇచ్చే పరికరాల ధరలకంటే బహిరంగ మార్కె ట్లో లభించే పరికరాల ధరలు తక్కువగా ఉన్నాయని, వాటికోసం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుఖాతాలో జమ చేస్తే వారికి మేలు జరుగుతుందని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. రైతురథంకు ఆ విధానాన్ని అమలుచేస్తే బాగుంటుందన్నారు. ఈ పథకంలో రైతుకు రూ.1.50 లక్షలు ఇచ్చినప్పటికీ కేవలం రూ.50వేలు మాత్రమే మిగులుతోందని, మిగిలిన రూ.లక్ష ఆయా ట్రాక్టర్ల కంపెనీలకు వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక రైతుకు తానే ఐచర్‌ కంపెనీ వారితో మాట్లాడి రూ.లక్ష తగ్గించానన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాకు జమచేస్తే ధర తక్కువ ఉన్నచోట కొనుగోలు చేసుకుంటారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement