
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీవై రామయ్య
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు నగరాభివృద్ధి పేరుతో నిధులు దోచుకోవడమే టీడీపీ లక్ష్యమని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకే టీడీపీ నేతలు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలంటూ హడావుడి చేస్తున్నారన్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల నుంచి స్మార్ట్ సిటీ, గ్రీన్ సిటీ అంటూ వేసిన రోడ్లనే వేస్తూ నిధులు కొల్లగొట్టారన్నారు. ప్రస్తుతం నంద్యాల తరహాలో కర్నూలులో అభివృద్ధి పనులు చేస్తామని ముందుకొస్తున్నారన్నారు. నంద్యాలలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విస్తరణ పేరుతో తవ్విన రహదారులను ఇప్పటికీ వేయలేదన్నారు. షాపులు కోల్పోయిన వారికి ఒక్కరికీ న్యాయం చేయలేదన్నారు.
కుట్టుమిషన్లను ఇస్తామని చెప్పి..ఎవరికీ ఇవ్వలేదన్నారు. 13 వేల ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ఒక్క గృహాన్ని కూడా పూర్తి చేయలేదన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలను భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి గెలిచారాన్నరు. కర్నూలులో అదే పని చేస్తామంటే భయపడేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్న విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తించుకోవాలని సూచించారు. నాలుగేళ్లుగా అధికారంలో ఉండి కర్నూలు నగరానికి నీటి కొరతను తీర్చేందుకు ఒక్క ట్యాంకునైనా నిర్మించారా అని ప్రశ్నించారు. నగరంలో కొత్తగా ఒక్క రహదారిని కూడా వేయలేదని, శివారు కాలనీల్లో డ్రెయినేజి, నీటి సమస్యలను పరిష్కరించలేదన్నారు. ఇప్పుడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. వీటిలో వచ్చే కమీషన్లను దండుకొని నంద్యాలలో మాదిరిగానే ఒక్క పనిని పూర్తి చేయబోరనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. మహిళలను మోసం చేయడానికి కార్పొరేషన్ ద్వారా అనేక తాయిలాలను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, వాటిని నమొమ్మద్దని సూచించారు.
ప్రత్యేక హోదాపై ప్రజల దృష్టి మరల్చడానికే...
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ ఎంపీలతో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయించడానికి నిర్ణయం తీసుకోవడంతో టీడీపీకి దిమ్మదిరిగి పోయిందని బీవై రామయ్య అన్నారు. నాలుగేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఏమి సాధించారనే ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో వచ్చే ఎన్నికల్లో పునాదులు కదులుతాయనే భయంతో ప్రజల దృష్టి మరల్చడానికి టీడీపీ.. కర్నూలు మునిసిపల్ ఎన్నికల అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. ఐదు కోట్ల ఆంధ్రులు ప్రత్యేకహోదా కోసం ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ గమనించాలని హితవు పలికారు. డబ్బులకు అమ్ముడు పోయిన కొందరు ప్రజాప్రతినిధులు తమ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేరును ఉచ్చరించడానికి కూడా అర్హులు కాదన్నారు. అలాంటి వారు విమర్శలు చేసేటప్పుడు స్థాయిని గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకులు తెర్నెకల్లు సురేందర్‌రెడ్డి, సీహెచ్ మద్దయ్య, ధనుంజాయాచారి, సత్యంయాదవ్, రెహమాన్, కృష్ణారెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, నాయకులు బుజ్జీ, సోమిరెడ్డి, సయ్యద్ ఆషీఫ్, ప్రహ్లాదాచారి, కరుణాకరరెడ్డి, అర్చనరెడ్డి మధు, ఆచారి తదితరులు పాల్గొన్నారు.
కోర్టు తీర్పు లీకైందా?..
కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉందని బీవై రామయ్య గుర్తు చేశారు. అయితే మునిసిపల్ శాఖమంత్రి నారాయణ.. నెలలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎలా చెబుతారని, కోర్టు తీర్పు ముందుగానే టీడీపీ నాయకులకు లీకైందా అని రామయ్య ప్రశ్నించారు. కర్నూలు కార్పొరేషన్‌కు ఏడేళ్ల నుంచి పాలకవర్గంలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఎన్నికలు నిర్వహించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పదవీ కాలం ముగిసే సమయంలో ఎన్నికలంటూ హడావుడి చేయడం వెనక ఆంతర్యం..అభివృద్ధి పనుల పేరిట కమీషన్లను దండుకోవడమేనన్నారు. ఎన్నికలు వస్తే కర్నూలులో అన్ని కౌన్సిల్ స్థానాలను కైవసం చేసుకొని మేయర్ పదవిని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment