వసంత కృష్ణప్రసాద్
సాక్షి, విజయవాడ : తెలుగు దేశం పార్టీ నాయకుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సభ్యతా సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని, కల్లు తాగిన కోతిలా ప్రేలాపనలు పేలుతున్నారని వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. మైలవరంలో ప్రజలకు సాగు నీరు, తాగునీరు ఇవ్వలేని సాగునీటి మంత్రి ఎటువంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారని, వాటికి నేడు కోట్లాది రూపాయల టెండర్లు పిలుస్తున్నారని తెలిపారు.
దానిపై తాము అధికారులకు ఫిర్యాదు చేస్తే ‘కృష్ణ ప్రసాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు’ అంటూ దేవినేని ఉమా ప్రచారం చేస్తున్నాడని చెప్పారు. మంత్రి ఉమా ఇరిగేషన్ శాఖను అవినీతి శాఖగా మార్చేశారని మండిపడ్డారు. ఇరిగేషన్‌లో జరుగుతున్న అవినీతిపై మంత్రి ఉమా ఎందుకు సమాధానం చెప్పటం లేదని ప్రశ్నించారు. మైలవరం నియోజకవర్గంలో ప్రభుత్వ, దేవాలయ భూముల్ని బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను తన అనుచరులతో ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
నియోజకవర్గ పరిధిలో అనుమతులు లేకుండా 60 కోట్ల రూపాయలుతో రోడ్లు వేస్తున్నారని, వాటికి 150 కోట్ల రూపాయలకు బిల్లులు చేసుకోబోతున్నారని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డిని విమర్శించే స్థాయి దేవినేని ఉమాకు లేదన్నారు. జగన్‌పై హత్యాయత్నం వెనుక అసలు వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతో.. డ్రామా అంటూ దుస్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేవినేని ఉమా త్వరలో విచారణను ఎదుర్కోడానికి సిద్దంగా ఉండు’ అంటూ హెచ్చరించారు. మంత్రి దేవినేని ఉమా అవినీతి నిరూపణ కావటం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment