గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిత్రంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గొడవలు, అశాంతి వాతావరణం సృష్టించి రాజకీయ అవసరాల కోసం పల్నాడు ప్రాంత ప్రజల మనోభావాలను గాయం చేయవద్దని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ నేతలు హితవు పలికారు. టీడీపీ బాధితులతో చలో ఆత్మకూరుకు బుధవారం గుంటూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వెళ్తున్న పార్టీ నేతలను పోలీసులు అడ్డుకొన్నారు. పార్టీ కార్యాలయానికి ఉదయం ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, టీడీపీ బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదవి చేపట్టినప్పటి నుంచి పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా ఉందన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఆత్మకూరులో 127 కుటుంబాలు మూడు నెలలుగా ఇబ్బంది పడి పునరావాస కేంద్రంలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పేది నిజమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేని పక్షంలో చంద్రబాబు లెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాచర్ల నియోజక వర్గంలో 2001 మార్చిలో ఏడుగురు కార్యకర్తలను దారుణంగా చంపిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏడుగురుని పొట్టనపెట్టుకొన్నారని చెప్పారు.
నిజాలు ప్రపంచానికి తెలియజేస్తాం
పల్నాడు ప్రాంతంలో టీడీపీ బాధితులందరినీ చంద్రబాబు వద్దకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆత్మకూరులో అరాచకం అంటూ చంద్రబాబు చేస్తున్న హంగామాలో నిజాలను బయటపెట్టి తీరుతామన్నారు. ఆత్మకూరు, పల్నాడులో ఏమీ జరగకపోయినా కుట్ర పూరిత ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల అనుమతి తీసుకొని తాము ఆత్మకూరు వెళ్తామని, అక్కడ ఏమి జరిగిందో ప్రపంచానికి తెలియజేస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. టీడీపీ పాలనలో యరపతినేని అక్రమ మైనింగ్‌పై ప్రశ్నించిన గురువాచారిని చిత్రహింసలకు గురిచేసిన తీరును, తురకపాలెం గ్రామంలో మైనార్టీ సోదరులపై దాడిచేసిన ఘటన ఫొటోలను ప్రెస్‌మీట్‌లో చూపించారు.
సమస్యలు సృష్టించడమే బాబు పని: కాసు
పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించడమే చంద్రబాబు ఉద్దేశమని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. పల్నాడులో దివంగత సీఎం వైఎస్సార్‌ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు మాట్లాడారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మేరుగ నాగార్జున, షేక్ మొహమ్మద్ ముస్తఫా, నంబూరు శంకరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ వైఎస్సార్ సీపీ నేతలు టీజీవీ కృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, చంద్రగిరి ఏసురత్నం, పాదర్తి రమేష్‌గాంధీ, డైమండ్ బాబు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment