
సాక్షి, అమరావతి: తమ పార్టీ తరఫున రంపచోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన వంతల రాజేశ్వరిపై అనర్హత వేటేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరింది. ఈ మేరకు బుధవారం వెలగపూడి అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో కోడెలను వైఎస్సార్‌సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్తఫా, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కలసి ఫిర్యాదు చేశారు.
వంతల రాజేశ్వరితోపాటు గతంలో టీడీపీలోకి ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలపైనా చర్య తీసుకోవాలని వారు స్పీకర్‌ను కోరారు. అనంతరం అసెంబ్లీ కార్యదర్శిని కలసి ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ పార్టీలోనే ఉన్నట్టుగా గెజిట్‌లో చూపించారని, దానిపై సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలని లిఖితపూర్వకంగా కోరగా ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. తాను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పారు.