
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి
విజయవాడ: వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఏపీ డీజీపీ, అడ్వోకేట్ జనరల్ వ్యవహారించిన తీరును మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) తప్పుపట్టారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్కే విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని, అడ్వేకోట్ జనరల్ వ్యాఖ్యల్ని కూడా హైకోర్టు తప్పుబట్టిందని వెల్లడించారు. మీరు(అడ్వోకేట్ జనరల్) ప్రభుత్వ నాయవాది కానీ చంద్రబాబుకు న్యాయవాది కాదని తెలుసుకోవాలని హితవు పలికారు. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేలా అడ్వోకేట్ జనరల్ మాట్లాడారని అన్నారు. మీకు ఇచ్చే జీతం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచేనని తెలుసుకోవాలని చెప్పారు.
ఎన్‌ఐఏ యాక్ట్, సివిల్ ఏవియేషన్ స్పష్టంగా చెబుతున్నా డీజీపీ ఎందుకు ఫాలో కావడం లేదని సూటిగా అడిగారు. మీకు చట్టం తెలియకపోతే డీజీపీ పోస్టుకి అనర్హులు అని వ్యాఖ్యానించారు. హత్యాయత్నం తప్పుదారి పట్టించడమే మీ ఉద్దేశమా అని సూటిగా ప్రశ్నించారు. పోలీసు మాన్యువల్ స్పష్టంగా ఉంది.. డీజీపీకి తెలియదా అని అడిగారు. తాను డీజీపీపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసుపై ఎలా స్పందించారని అన్నారు. చంద్రబాబు ఒత్తిడి మేరకే డీజీపీ వ్యవహరించారని ఆరోపించారు. కేసు ఎన్‌ఐఏ పరిధిలోకి వెళితే అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైకోర్టు కూడా ఈ విషయమై స్పష్టంగా వ్యాఖ్యానించిందని తెలిపారు. కేసు ఎన్‌ఐఏ పరిధిలోకి వెళ్తే ప్రత్యేక కోర్టు విచారణ చేస్తుందని, అప్పుడు అన్ని విషయాలు బయటికి వస్తాయని వ్యాక్యానించారు. నిందితుడు శ్రీనివాసరావుని మట్టుబెట్టడానికి కూడా టీడీపీ నేతలు ప్రయత్నించే అవకాశముందన్నారు. చట్టాలను అతిక్రమించి కేసు రాష్ట్ర పరిధిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు..కానీ కచ్చితంగా ఎన్‌ఐఏ పరిధిలోకి వెళ్తుందని చెప్పారు. ఈ కేసును సుమోటోగా కూడా కేంద్రం తీసుకుని దర్యాప్తు చేయవచ్చునని హైకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment