వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో సహా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని నెల్లూరు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నెల్లూరులో కాకాణి విలేకరులతో మాట్లాడుతూ..అసలు కారణాలు పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. మెడపైన దాడికి ప్రయత్నం చేసినా..జగన్ అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు.
దాడి జరిగిన కాసేపటికే మార్ఫింగ్ ఫోటోలు బయటపెట్టి విషయాన్ని పెడద్రోవ పట్టించారని ఆరోపించారు. ఐటీ దాడుల అంశాన్ని క్యాబినేట్‌లో పెట్టి చర్చించాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు చట్టానికి అతీతులా అని సూటిగా అడిగారు. పథకం ప్రకారం దాడి చేసి అది ఫెయిల్ అవ్వడంతో ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రంలో ఎన్నికల కోసం పోలీసుల ద్వారా డబ్బు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారని వెల్లడించారు.
నాలుగుసార్లు ఓడిపోయి మంత్రి పదవి తెచ్చుకున్న సోమిరెడ్డికి జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని తీవ్రంగా మండిపడ్డారు. దాడి చేసిన శ్రీనివాస్‌తో పాటు అతని సోదరుడు కూడా టీడీపీకి చెందిన వ్యక్తేనని స్పష్టం అయినట్లు వెల్లడించారు. 2016 నుంచి వీరికి టీడీపీ సభ్యత్వాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment