చంద్రబాబు విజన్‌ 2020 గుట్టువిప్పిన రోజా.. | YSRCP MLA RK Roja Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబు.. ప్రతిపక్షనేతనా.. లేక పనికిమాలిన నేతనా?

Published Mon, Jan 20 2020 10:12 AM | Last Updated on Mon, Jan 20 2020 2:38 PM

YSRCP MLA RK Roja Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి అనే భ్రమలో ప్రజలను మోసంచేసి కేవలం గ్రాఫిక్స్‌తోనే ఐదేళ్లు కాలంగడిపారని మండిపడ్డారు. చంద్రబాబు విజన్‌ 2020 ఏంటో అమరావతి కుంభకోణంతోనే తేటతెల్లమైందని రోజా అన్నారు. చంద్రబాబుది 420 విజన్‌ అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన చట్టసభలను అడ్డుకోవడం, అల్లర్లు సృష్టించడమే చంద్రబాబు విజనా? అని ఆమె ప్రశ్నించారు. కేవలం 20 మంది శాసనసభ్యులతో.. 20 గ్రామాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలో వేలకోట్ల ఖర్చుపెట్టినా తన కుమారుడు నారా లోకేష్‌ను గెలిపించుకోలేకపోయారని, ఇంతకంటే రెఫరెండమ్‌ ఇంకేముంటుందని వ్యాఖ్యానించారు. సీఎంగా ఉండి అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. చంద్రబాబు ప్రతిపక్షనేతనా లేక పనికిమాలిన నేతనా అని రోజా నిలదీశారు.

సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందకు రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయారు. జీఎన్‌రావు, బీసీజీ కమిటీలపై లోకేష్‌ అసభ్యకరంగా మాట్లాడారు. రాజధానిపై టీడీపీ నేతలు సిగ్గులేకుండా అసత్యాలు మాట్లాడుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు రాయలసీమకు చేసింది ఏమీలేదు. రాయలసీమ ద్రోహి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటే చంద్రబాబు, టీడీపీకి పుట్టగతులు లేకుండాపోతాయి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుని, 40 ఏళ్ల సీఎం జగన్‌ అడుక్కునే గతిపట్టించారు. ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరుపుతున్నాం. ప్రజల రాజధానిని నిర్మిస్తాం’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement