వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ రావు (ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ : ‘ప్రత్యేక హోదాపై నాలుగేళ్లుగా కాలయాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు దీక్షకు దిగటం హాస్యాస్పదంగా ఉంద’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ రావు ఎద్దేవా చేశారు. మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకే ఆయన ఈ దీక్ష చేపట్టారని అన్నారు. వైఎస్సాఆర్ సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి చేసిన ‘ధర్మ పోరాట దీక్ష’ కొంగ చేసే దొంగ జపంలాంటిద’ని వాఖ్యానించారు.
వైఎస్సార్ సీపీ వల్లే ‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యే హోదా’ అంశంపై ప్రజల్లో చైతన్యం వచ్చిందని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్రంతో కొట్లాడి ప్రత్యేక హోదా సాధించి ఉంటే రాష్ట్రం ఇన్ని అప్పుల్లో కూరుకుపోయేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఒక్కసారి కూడా ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేయని బాబు 2019 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.
పాలనలో చంద్రబాబుకు పదేళ్ల అనుభవం మాట ఏమోగానీ, ప్రజలను మోసం చేయడంలో మాత్రం చాలా అనుభవం ఉందని చురకలంటించారు. నాలుగేళ్లపాటు కేంద్రంలో భాగమైన టీడీపీ ఇప్పుడు తప్పంతా బీజేపీదే అన్నట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా సాధన కోసం ఎందాకైనా పోరాడుతుందనీ.. అందుకనే పార్టీ ఎంపీలమంతా రాజీనామా చేశామని వరప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment