సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా సాధన కోసం చెక్కు చెదరని సంకల్పంతో మొక్కవోని పట్టుదలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేస్తున్న ఆమరణ దీక్ష బుధవారానికి ఆరో రోజుకు చేరుకుంది. దీక్షకు దిగిన ఐదుగురు ఎంపీల్లో ముగ్గురి ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఇప్పటికే బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. యువ ఎంపీలైన పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం పట్టుదలతో దీక్షను ముందుకు తీసుకెళ్తున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మిథున్, అవినాష్ దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని రామ్‌మనోహర్ లోహియా (ఆర్‌ఎంఎల్) ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
ఎంపీలతో మాట్లాడిన వైఎస్ జగన్
గుంటూరు జిల్లా పాదయాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం దీక్షలో ఉన్న ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ‘మీ దీక్ష మాకు స్ఫూర్తి. ఆమరణ దీక్షకు దిగడాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారు.. మీ ఐదుగురి దీక్షను చూసి రాష్ట్రం గర్వపడుతోంది.. మీ పోరాటాన్ని ఏపీ ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారు. మిమ్మల్ని చూసి గర్విస్తు న్నాను’ అని జగన్ వారిని ఉత్తేజపరిచారు. కాగా, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలను కూడా నీరసం బాగా ఆవహించినప్పటికీ పట్టు వీడకుండా దీక్ష కొనసాగిస్తున్నా రు. వీరిద్దరి ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిన్నదని, రక్తంలో చక్కెరస్థాయి క్రమంగా ప్రమాదస్థాయికి పడిపోతోందని, ఇతర వైద్య పరీక్షల ఫలితాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయని వైద్యులు మంగళవారం ఉదయం నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో దీక్షా శిబిరంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment