కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్ర విభజన హామీలు, ప్రజా సమస్యలపరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. వంచనపై ప్రజాగర్జన పేరుతో నిర్వహించిన ఈ ధర్నాల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించి జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యేక హోదాపై టీడీపీ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద వంచనపై గర్జన సభను నిర్వహించారు. అనంతరం విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డికి పార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విశాఖ పాత జైలు రోడ్‌లోని ఉమెన్స్ కళాశాల ఎదుట వంచనపై గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం పార్టీ నేతలు వేలాదిమంది పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ కోఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. విజయవాడలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కలెñక్టర్ క్యాంపు కార్యాలయం వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతంకు వినతిపత్రం అందజేశారు. పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వంచనపై గర్జన పేరుతో గుంటూరు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ చేపట్టిన మహాధర్నా విజయవంతమైంది.
ఈ ధర్నాకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు, పార్టీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద వంచనపై గర్జన కార్యక్రమాన్ని నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో వంచనపై గర్జనలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. చిత్తూరులోని కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాకు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట వేలాది మందితో వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన తెలిపారు. అనంతరం అడిషనల్ జాయింట్ కలెక్టర్ (ఏజేసీ) రామస్వామికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా విజయవంతమైంది. జిల్లావ్యాప్తంగా సీనియర్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. కడప కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నాలో ఎంపీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొని ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment