
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబుతో పాటు ఆయన కుమారుడిపై గురువారం టీడీపీ శ్రేణులు భౌతిక దాడి చేశాయి. ఐరాల మండలంలోని పొలకల కట్టకిందపల్లిలో రిగ్గింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందటంతో ఆయన అక‍్కడకు వెళ్లారు. దీంతో టీడీపీ శ్రేణులు...ఎంఎస్ బాబును పోలింగ్ బూత్‌లోకి వెళ్లనీయకుండా అడ్డుకుని.... దాడి చేయడమే కాకుండా ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు దాడిలో గాయపడ్డ బాబును వేరే వాహనంలో చికిత్స నిమిత్తం చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో బాబు వాహనం పూర్తిగా ధ్వంసం అయింది. సంఘటన స్థలంలో ఉన్న పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహించారు.
కాగా ఎంఎస్ బాబు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పూతలపట్టు మండలంలోని బందార్లపల్లెలో మొదటగా ఎంఎస్ బాబుపై దాడులకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే అక్కడ ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో తరువాత ఐరాల మండలంలో కట్టకిందపల్లిలో పథకం ప్రకారం దాడులు చేశారు.