
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు సీఎం అభ్యర్థి కూడా ఫిరాయింపుదారులే అయినా ఆశ్చర్యపోనవసరం లేదని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుక, ఎస్వీ మోహన్‌రెడ్డిని ప్రకటించి, మరోక్షంగా ఎన్నికలకు ముందే తమ పార్టీలోకి ఆ రెండు సీట్లు చేరేలా చేసిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తయారు చేసిన ఫిరాయింపు అభ్యర్థులే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉంటారని, అంతకంటే ఆ పార్టీకి మరో గత్యంతరం లేదన్నారు. చంద్రబాబునాయుడి మానసిక స్థితి సరిగా లేకపోవడం, మంత్రి నారా లోకేష్ పప్పు లేదా ముద్ద పప్పు కావడంతో భవిష్యత్‌లో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్థులుగా కూడా ఫిరాయింపుదారులే అయినా ఆశ్చర్యం లేదన్నారు.
లోకేష్ పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీలేదు..
మంత్రి లోకేష్ పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీలేదని, ఆయన తన శాఖ పనితీరుపై కనీసం సమీక్షించకుండా సంబంధంలేని ఇరిగేషన్, హెల్త్, పీఆర్ శాఖలకు సంబంధించిన భవనాలను ప్రారంభించి ప్రజలను అయోమయానికి గురి చేశారని బీవై రామయ్య విమర్శించారు. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం దారుణమని, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో రిజర్వేషన్ అభ్యర్థులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వాల్సిన మంత్రి, తన పరిధి కాదంటూ దాటవేయడం దారుణమన్నారు. అదే నిజమనుకుంటే ఇరిగేషన్, పీఆర్, హెల్త్ శాఖలకు సంబంధించిన భవనాలను ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు.
తండ్రిబాటలో అబద్ధాలు..
మంత్రి లోకేష్ అబద్ధాలు చెప్పడంలో తండ్రి చంద్రబాబునాయుడును మించిపోయారన్నారు. కర్నూలును దేశ రెండో రాజధానిగా డిమాండ్ చేస్తున్న ఆయన.. రాష్ట్రానికి రెండో రాజధానిగా ప్రకటించమంటే ఎందుకు తోక ముడుస్తున్నారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడంలో నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టీడీపీ.. ఇప్పుడు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. దొడ్డిదారిలో మంత్రి అయిన లోకేష్‌కు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు.
జగన్ వండర్..లోకేష్ బ్లండర్ : సిద్ధార్థరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వండర్ అయితే, నారా లోకేష్ బ్లండర్ అని వైఎస్సార్‌సీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాల పరామర్శ కోసం ఢిల్లీ పెద్దలను ఎదిరించిన జగనన్నకు, ఓటుకు నోటు కేసుకు భయపడి ప్రత్యేక హోదాను అదే ఢిల్లీలో తాకట్టుపెట్టిన సీఎం చంద్రబాబునాయుడుకు నక్కకు నాగలోకానికున్నంత తేడా ఉందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణకొట్కూరులో 2012లో ప్రారంభించిన ట్యాంకుకు రంగులు వేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాం కుగా, కలెక్టర్, ఎంపీపీ ప్రారంభించిన పంచా యతీ కార్యాలయానికి లోకేష్ మళ్లీ శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటన్నారు. సొంత పార్టీ నాయకులపై నమ్మకం లేక జిల్లాలో మంత్రి, జెడ్పీ చైర్మన్, మార్కెట్ యార్డు చైర్మన్ తదితర పదవులన్నీ ఫిరాయింపుదారులకే కట్టబెట్టినట్లు జిల్లా నాయకుడు తోట వెంకటకృష్ణారెడ్డి తెలిపారు.
పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీకి బలముంటే వెంటనే కర్నూలు మునిసిపల్ ఎన్నికలను నిర్వహించాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్, అసెంబ్లీ సీట్లను ఫిరాయింపులకు ఇవ్వడం ద్వారా తమ విజయం మరింత సులువైందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర నాయకులు చెరుకుచెర్ల రఘురామయ్య, సీహెచ్ మద్దయ్య, ఎస్‌ఏ రెహమాన్, కర్నాటి పుల్లారెడ్డి, సత్యం యాదవ్, పర్ల శ్రీధర్‌రెడ్డి, ధనుంజయాచారి, రేణుకమ్మ, కరుణాకరరెడ్డి, కోనేటి వెంకటేశ్వర్లు, ఆసిఫ్, దాసు, సుధాకరరెడ్డి, మహేశ్వరరెడ్డి, చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment