ఈనెల 28వ తేదీ ఆదివారం పాఠశాలలో సూర్యనమస్కారాలు వేస్తున్న విద్యార్థులు
ఒంగోలు/చీరాల అర్బన్: ప్రభుత్వ కార్యక్రమాలతో సర్కారు పాఠశాలల్లో చదువులు గాలిలో దీపంలా మారుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, దాని నిర్వహణకు ముందు రెండు రోజులు ప్రిపరేషన్, ఆ తర్వాత మరొకటి.. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా కార్యక్రమాల నిర్వహణతో ప్రభుత్వ పాఠశాలలో చదువులు ముందుకు సాగడంలేదు. ఈ ఏడాది జనవరి నెల మొత్తం విద్యార్థులకు బోధన అంటే ఏమిటో తెలియకుండా గడిచిపోయింది. అసలే ప్రభుత్వ పాఠశాలలపై ఇప్పటికే సమాజంలో వ్యతిరేక భావన ఉంది. దీనికి తోడు ఇటాంటి కార్యక్రమాలతో ప్రభుత్వమే విద్యను నిర్వీర్యం చేసేలా ఉందని, పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్న సమయంలో విద్యార్థులు ఎంతో నష్టపోతారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందిస్తామని, డిజిటల్ క్లాసు రూములు, బయోమెట్రిక్ ఏర్పాటు అంటూ టీడీపీ సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది. కానీ బడిలో పాఠం చెబుదామని పుస్తకం పట్టుకోగానే ఏదో ఒక కారణంతో విద్యార్థులను బయటకు తీసుకువెళుతుంటే తాము ఎవరికి విద్యబోధించాలో అర్థం కావడంలేదని ఉపాధ్యాయుల నుంచి ఆవేదన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఎస్‌సీఈఆర్‌టి రూపొందించిన అకడమిక్ క్యాలెండర్ ప్రామాణికమని, కానీ అది కూడా అమలు చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ కార్యక్రమాల తీరు..
2017 డిసెంబర్ 14వ తేదీ మొదలు 2018 జనవరి నెలాఖరు వరకు పాఠం చెప్పేందుకు ఉపాధ్యాయునికి సరైన అవకాశమే లేకుండా పోయిందనేది యదార్థం. డిసెంబర్ 14 నుంచి 22వ తేదీవరకు సమ్మేటివ్ 1 పరీక్షలు నిర్వహించారు. 23 నుంచి క్రిస్మస్ శెలవులు ప్రకటించారు. 28, 29 తేదీలలో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇదే సమయంలో గణిత సప్తాహాల నిర్వహణకు ప్రభుత్వం పిలుపు ఇవ్వడంతో కొన్ని రకాల తరగతులకు మంగళం పాడక తప్పలేదు. ఇక 31వ తేదీ శెలవు కావడంతో పాఠశాలల్లో ముందస్తుగా అంటే డిసెంబర్ 30వ తేదీనే పాఠశాలల అలంకరణ కార్యక్రమాలపై విద్యార్థులు దృష్టిసారించడం, ఒంగోలులో గజల్ శ్రీనివాస్ కార్యక్రమ విజయోత్సవంలో విద్యార్థులే పెద్ద ఎత్తున హాజరుకావాల్సి రావడం గమనార్హం. జనవరి 1న జిల్లాలో అత్యధిక శాతం పాఠశాలలు ఆప్షనల్ హాలిడే ప్రకటించేసుకున్నాయి.
2 నుంచి 11వ తేదీవరకు క్రీడాజన్మభూమిగా నామకరణం చేసి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లోని విద్యార్థులు అందరినీ పదో తరగతి సహా విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేటట్లు చేయాలని ఆదేశించడంతో ఒక వైపు క్రీడలు, 5కె రన్, మరో వైపు విద్యార్థులకు వ్యాసరచన, వ్యక్తృత్వ పోటీలు, పాఠశాల స్థాయి, మండల స్థాయి వంటి ఆటల పోటీలతోపాటు ఓడిఎఫ్‌పై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 12వ తేదీనుంచి 21 వరకు సంక్రాంతి సెలవులు. 23న 3కెరన్ పోటీలు నిర్వహణ, అదేరోజు మద్యాహ్నభోజన కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడంతో విద్యార్థులకు భోజన ప్రక్రియకు అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులపైనే పడింది. 23,24 తేదీలలో గణ తంత్ర దినోత్సవ పోటీలు నిర్వహించి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. 26వతేదీ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. 27వ తేదీ సూర్య ఆరాధన కార్యక్రమంలో భాగంగా వ్యక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. 28న ఆదివారం అయినా ఉదయాన్నే సూర్య నమస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఈనెల 31వ తేదీవరకు ఒక వైపు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, మరో వైపు డీఎస్సీ 2014 ఉపాధ్యాయులకు శిక్షణ వెరసి విద్యాబోధన కుంటుపడింది. 29 నుంచి 31వ తేదీవరకు స్టూడెంట్ లెర్నింగ్ అచీవ్‌మెంట్ సర్వే అంటూ పరీక్షలు పాఠశాలల్లో జరగనున్నాయి.
కార్యక్రమాల వివరాలు..
జనవరి 2 నుంచి 11 వరకు – జన్మభూమి–మా ఊరు
జనవరి 12 నుంచి 21 వరకు – సంక్రాంతి సెలవులు
జనవరి 22 – అమ్మకు వందనం
జనవరి 23 – రిపబ్లిక్ డే సందర్భంగా ఆటల పోటీలు
జనవరి 24– జాతీయ బాలికా దినోత్సవం
జనవరి 25 –ఓటర్ దినోత్సవం
జనవరి 26– రిపబ్లిక్ దినోత్సవం
జనవరి 28– సూర్యారాధన
Comments
Please login to add a commentAdd a comment