
సాక్షి, రంగారెడ్డి : మద్యం ప్రియులు ‘ఫుల్’ జోష్‌తో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. డిసెంబర్ 31వ తేదీన ఒక్క రోజే సుమారు రూ.50 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయంటే.. మత్తులో ఏవిధంగా మునిగితేలారో అర్థమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని 412 మద్యం దుకాణాలు, 390 బార్ల పరిధిలో సాధారణ రోజుల్లో విక్రయాలు రూ.11 కోట్లకు మించవు. కానీ ఏడాది చివరి రోజున మాత్రం దాదాపు నాలుగు రెట్లు అదనంగా మందుబాబులు మద్యం తాగేశారు. ధరలు పెరిగినా అమ్మకాలు భారీగా జరగడాన్ని చూసి ఎక్సైజ్ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 31న రూ.37 కోట్లకు మించి అమ్మకాలు జరగలేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సారి అదనంగా రూ.13 కోట్ల విలువైన విక్రయాలు జరగడం విశేషం. నగర శివారులోని మద్యం దుకాణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలు కూడా 31వ తేదీన మద్యం ప్రియులతో కిటకిటలాడాయి. అర్ధరాత్రి వరకు అమ్మకాల్లో జోరు ఏమాత్రం తగ్గలేదు.
ఒక్కనెలలో రూ. 408 కోట్లు
డిసెంబర్ నెలలో అమ్మకాలు గణనీయంగా జరిగాయి. ముఖ్యంగా యువకుల నుంచి బీర్లకు భలే డిమాండ్ కనిపించింది. చాలా దుకాణాల్లో నెలాఖరులో బీర్ల కొరత ఏర్పడింది. దీంతో ‘నో బీర్’ బోర్డులు అక్కడక్కడా దర్శనమిచ్చాయి. విలువ పరంగా చూస్తే గతేడాదితో పోల్చితే మద్యం అమ్మకాలు 20 శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఐఎంఎల్ అమ్మకాలు 17 శాతం పెరగగా.. బీర్ల విక్రయాలు మాత్రం 28 శాతానికి ఎగబాకాయి. 2016 డిసెంబర్‌లో రూ.341 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా.. 2017 డిసెంబర్‌లో ఈ మొత్తం రూ.408 కోట్లకు చేరుకుంది. అంటే రూ.67 కోట్ల విలువైన మద్యాన్ని ఈసారి అదనంగా తాగేశారన్నమాట.
డిసెంబర్ 31న అమ్మకాలు
ఐఎంల్ కాటన్లు : 93,200
బీర్ల కాటన్లు : 1,12,664
గత ఏడాది, ప్రస్తుత మద్యం అమ్మకాలు ఇలా
ఐఎంఎల్ కాటన్లు బీర్ల కాటన్లు విలువ
డిసెంబర్– 2016 5.94 లక్షలు 6.60 లక్షలు రూ.341 కోట్లు
డిసెంబర్ –2017 6.99 లక్షలు 8.45 లక్షలు రూ.408 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment