2017 సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఫోటోల్లో ఇది ఒకటి. ఓ పెళ్లి కూతురు.. తన పెంపుడు కుక్కతో దిగిన ఈ ఫోటో నెటిజన్లను తెగ ఆకర్షించింది. పెళ్లి కూతురు, కుక్క ఇద్దరూ ఒకేలాంటి దుస్తులు ధరించి దిగిన ఈ ఫోటో జంతు ప్రేమికుల మనసు దోచింది. నాడు ఫోటో ఎంత వైరల్ అయ్యిందో నేడు దాని వెనక కథ అంత కన్నా ఎక్కువ ట్రెండ్ అవుతోంది. ఫోటోలోని యువతి పేరు మితాలి సాల్వి, కుక్కల ట్రైనర్. ఈ క్రమంలో కుక్కలతో తన పరిచయం, వాటితో తన అనుబంధం, కుక్కల ట్రైనర్‌గా విధానం వంటి పలు అంశాల గురించి ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు సాల్వి.ఆ వివరాలు ఆమె మాటల్లోనే
కుక్కలే నా థెరపిస్టులు..
‘నాకు ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికి అమ్మ మరణించింది. ఆ సమయంలో నన్ను ఓదార్చింది.. నాకు స్వాంతన చేకూర్చింది ఈ కుక్కలే. చిన్న ముక్కుతో.. తోక ఊపుతూ నా చుట్టు తిరిగే ఈ కుక్కలే నాకు థెరపిస్టులు. ఇప్పటి వరకు నా జీవితంలో 13 కుక్కలు ఉన్నాయి. వాటి మీద అభిమానంతో వెటర్నరి డాక్టర్ కావాలనుకున్నాను. కానీ నా కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. వారి బలవంత మీద ఇంజనీరింగ్‌లో చేరాను’ అన్నారు సాల్వి.
అలా ‘పాంటీ’ నా జీవితంలోకి వచ్చింది..
పాంటీతో తన పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘ఓ రోజు నేను, నా స్నేహితుడు అలీ ఇద్దరం రోడ్డు మీద నడుచుకుంటు వెళ్తున్నాం. అప్పుడు ఓ దుకాణదారుడు ఓ చిన్న కుక్క పిల్లను కొట్టడం గమనించాం. వెంటనే అక్కడికి వెళ్లి దాన్ని కాపాడం. తర్వాత ఆ చిన్న కుక్క పిల్లను నాతో పాటు హాస్టల్‌కు తీసుకెళ్లాలనుకున్నాను. కానీ పెంపుడు జంతువులను మా హాస్టల్‌లోనికి అనుమతించరు. దాంతో ఆ చిన్న కుక్కను నా కాలేజీ బ్యాగులో పెట్టుకుని.. సెక్యూరిటీ కంటపడకుండా నా రూమ్‌కు తీసుకెళ్లాను’ అని గుర్తు చేసుకున్నారు సాల్వి.
‘పాంటీ’ పేరు వెనక కథ..
అయితే తన కుక్కకు పాంటీ అని పేరు పెట్టడం వెనక ఓ తమాషా సంఘటన జరిగిందన్నారు సాల్వి. ‘రూమ్‌లోకి తీసుకువచ్చిన తర్వాత ఓ రోజు ఆ కుక్క పిల్ల లాండ్రీ బకెట్‌లోంచి బయటకు దూకింది. అప్పుడు దానితో పాటు నా పాంటీ, బ్రా కూడా వచ్చాయి. వాటిని మీద వేసుకుని నా వద్దకు పరిగెత్తుకు వచ్చింది. అది చూసి దానికి ‘పాంటీ’ అని పేరు పెడితే బాగుంటుందనిపించింది. అందుకే దానికి ‘పాంటీ ’అని పేరు పెట్టాను అంటూ గుర్తు చేసుకున్నారు సాల్వి.
కుక్కల ట్రైనర్‌గా ఎలా మారానంటూ..
‘ఓ రోజు ‘పాంటీ’కి వాక్సిన్ వేపించాలని ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడ అది ప్రవర్తించిన తీరు వైద్యులను ఆకర్షించింది. ‘పాంటీ’ఎక్కడైన శిక్షణ ఇప్పించారా అని ప్రశ్నించారు. వారి ప్రశ్న నాకొక అవకాశాన్ని చూపించింది. దాంతో నేను కుక్కల ట్రైనర్‌గా మారాలనుకున్నాను. దీని గురించి ఇంట్లో వారికి చెప్తే ఒప్పు కోలేదు. అయితే ఈ విషయంలో అలీ నాకు మద్దతిచ్చాడు. దాంతో మేం ఇద్దరం పొదుపు చేసిన డబ్బుతో నేను కుక్కల ట్రైనర్‌గా శిక్షణ పొందాను. ఇప్పటికి 500 కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాను. ‘పాంటీ’ నాకు సహయకురాలిగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు సాల్వి.
అంతేకాక ‘నాకు నచ్చిన కెరియర్‌ను ఎంచుకోవడంతో పాటు.. అలీతో వివాహం వరకు నా జీవితంలోని ప్రతి ముఖ్య దశలో ‘పాంటీ’ నాతో పాటే ఉంది. అందుకే వివాహం రోజున నేను, ‘పాంటీ’ ఒకే రకమైన దుస్తులు ధరించాము. తను నాకు ఎంతో మంచి స్నేహితురాలు’ అంటూ చెప్పుకొచ్చారు సాల్వి. రెండు రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఈ స్టోరీ తెగ వైరలవుతోంది. ఇప్పటికే 16 వేల మంది దీనిపై స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 99 వేల మంది లైక్ చేశారు. ‘మీ కథనం చాలా బాగుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మేం కూడా మా పెళ్లిలో మా కుక్కలకు మేం వేసుకున్న లాంటి బట్టలే కుట్టించాం’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment