
బెడ్‌రూమ్‌లోని పడక మంచంపై దర్జాగా విన్యాసాలు చేస్తున్న ఓ భారీ కొండ చిలువ కంటబడింది.
క్వీన్స్‌లాండ్ : పగలంతా ఉద్యోగానికి వెళ్లొచ్చి ఇంట్లో కాస్త సేద తీరుతామనుకున్న ఓ వ్యక్తికి ఊహించని అతిథి ఎదురైంది. బెడ్‌రూమ్‌లోని పడక మంచంపై దర్జాగా విన్యాసాలు చేస్తున్న ఓ భారీ కొండ చిలువ కంటబడింది. చచ్చాన్రా దేవుడా..! అనుకుంటూ అతను అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. వెంటనే ‘సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్’ అనే పాములు పట్టే సర్వీస్ సెంటర్‌కు ఫోన్ చేయడంతో వారొచ్చి ఆ కార్పెట్ పైథాన్‌ను పట్టుకెళ్లి అడవిలో వదిలేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లో గత శనివారం జరిగింది. దీని గురించి సదరు స్నేక్ క్యాచర్ చేసిన ఫేస్‌బుక్ పోస్టు వైరల్‌గా మారింది.
‘బుసలు కొడుతున్న ఓ భారీ పాము బెడ్‌రూమ్‌లో దర్శనమివ్వడంతో ఓ వ్యక్తి మాకు ఫోన్ చేశాడు. వెంటనే వెళ్లి ఆ పైథాన్‌ను పట్టుకున్నాం. ఇంట్లోకి పురుగుపుట్రా ఏమీ చొరబడకుండా కిటికీలు, దర్వాజాలన్నీ మూసేసినా కూడా పామెలా వచ్చిందో అంతుబట్టడం లేదని ఆ ఇంటి యజమాని అనుమానం వ్యక్తం చేశాడు. అతను చెప్పింది నిజమే..! ఆ పాము బయటి నుంచి రాలేదు. సీలింగ్ (రూఫ్) నుంచి వచ్చి లైట్‌పై కూర్చుంది. దాని బరువుకు లైట్ విరిగిపడి బెడ్ మీద ఊడిపడింది. దాంతోపాటు పైథాన్ కూడా బెడ్‌పై చేరింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో ఆ కొండచిలువ నిర్భయంగా విశ్రాంతిలో మునిగిపోయింది’అని స్నేక్ క్యాచర్ పేర్కొంది.