బెంగళూరు : సాధరణంగా కోతి నుంచి మనిషి పుట్టాడని సైన్స్ చెబుతుంది. అందుకే అప్పుడప్పుడు మనషి కోతిలా.. కోతి మనిషిలా ప్రవర్తిస్తుంటారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే.. బంధువులు, సన్నిహితులు వచ్చి ఓదార్చడం సహజం. కానీ కర్ణాటకలో మాత్రం ఓ వానరం.. చావింటికి వెళ్లి బంధువులను ఓదార్చింది. వినడానికి వింతగా ఉన్న ఇది వాస్తవం. వివరాలు.. శుక్రవారం(నిన్న) కర్ణాటకలోని నార్గుండ్‌కు చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. దాంతో అతని బంధువులంతా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి.. సంతాపం తెలిపారు.
ఆ సమయంలో అనుకోని అతిథిలా ఓ కోతి అక్కడకు వచ్చి ఏడుస్తున్న ఓ మహిళ దగ్గరకు వెళ్లి భుజం మీద చేయి వేసి.. తల నిమిరి ఓదార్చింది. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మరి కొందరైతే ఏకంగా హనుమాన్ జయంతి రోజే ఇలా జరిగింది.. స్వయంగా ఆ హనుమంతుడే వచ్చి ఓదార్చడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వానరం గతంలో కూడా ఇలా కొందరి ఇళ్లకు వెళ్లి ఓదార్చిందని చెప్తున్నారు స్థానికులు.
గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తే చాలు ఈ కోతి అక్కడ తప్పక ప్రత్యక్షమవుతుందంటున్నారు స్థానికులు. మనుషులు ఒకర్ని ఒకరు ఎలా ఓదార్చుకుంటారో.. కోతి కూడా అలాగే చేస్తుందని తెలిపారు. ఇలా గత కొన్ని నెలలుగా జరుగుతుందన్నారు. ప్రస్తుతం చావింటికి కోతి రావడం ఒక ఆనవాయితీగా మారిందన్నారు. ఒకవేళ వానరం రాకపోతే అంత్యక్రియలు పూర్తికానట్లే భావిస్తున్నామన్నారు స్థానికులు.
Comments
Please login to add a commentAdd a comment