దోహా : నేటికి కూడా స్త్రీని ఓ అంగడి సరుకుగా భావించే సమాజం ఇది. దేశాలు, ప్రాంతాలు మారినప్పటికి ఈ భావజాలం మాత్రం మారదు. అందులోనూ జీవితాంతం తనకు తోడుగా ఉండటానికి వచ్చిన స్త్రీ పట్ల మరింత చులకన భావం కనిపిస్తుంటుంది చాలా మంది మగాళ్లలో. బయట చాలా విషయాల్లో కనీసం నోరేత్తని ఆజానుబాహులు కూడా భార్యల దగ్గరకు వచ్చే సరికి ప్రతి చిన్న విషయానికి కూడా చేయ్యెత్తడానికి రెడీగా ఉంటారు. ఈ ఆధునిక కాలంలో కూడా భార్యంటే కుక్కిన పేనులా పడుంటుందనే ధైర్యంతో పురుషులు రెచ్చిపోతుంటే.. భర్త వదిలేస్తే తన జీవితమే నాశనమవుతుందనే భయంతో మహిళలు బతుకీడుస్తున్న సంఘటనలు కోకొల్లలు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే మళ్లీ ఓ వందేళ్లు వెనక్కి ప్రయాణించాం అనిపించకమానదు. ఇప్పటికి కొన్ని ముస్లిం దేశాల్లో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. నేటికీ మహిళకు వారిచ్చే విలువ ఏంటో ఈ వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఖతర్‌కు చెందిన సోషియాలజిస్ట్ ఒకరు భార్యను ఎలా కొట్టాలో వివరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దారుణం ఏంటంటే భార్యను కొట్టడమే తప్పంటే.. దానికి మతం కూడా అనుమతించిందంటూ కొన్ని తలకు మాసిన నియమాలు చెప్పుకొచ్చాడీ సోషియాలజిస్ట్.
వివరాలు.. ‘పెళ్లైన మగవారు ఈ వీడియోను తప్పక చూడాలి. భార్యను కొట్టడం తప్పనిసరి.. కానీ ప్రతిరోజు కాదు. ఈ కొట్టడం కూడా ఎలా ఉండాలంటే భార్యకు తాను ఆడదాన్ని అని.. భర్త మగవాడు, బలవంతుడు అనే విషయాన్ని గుర్తుకు తెచ్చేలా కొట్టాలి. భార్యకు తన భర్త శక్తిసామర్థ్యాలు తెలిసేలా దండించాలి. ముందు మీరొక విషయం అర్థం చేసుకోవాలి. కుటుంబాన్ని ఓ కంపెనీగా భావిస్తే.. భర్త దాని యజమాని. భార్య అందులో వర్కర్. వర్కర్ బుద్ధిగా మసులు కోవడం కోసం యజమాని వారిని దండించాలి. అలా అయితేనే వారి జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమగా ఉండటం వల్ల క్రమశిక్షణ అలవడద’ని సదరు సోషియాలజిస్టు ఈ వీడియోలో పేర్కొన్నాడు.
అంతేకాక ‘భార్య పద్దతిగా నడుచుకోవాలంటే భర్త తన ప్రేమను పక్కకు పెట్టి భార్యను కొట్టాలి. భార్య క్రమశిక్షణతో మసలకపోతే.. ముందు హెచ్చరించాలి.. తరువాత సలహా ఇవ్వాలి.. అప్పటికి దారికి రాకపోతే పడక గదికి దూరంగా ఉంచాలి. ఆఖరి ప్రయత్నంగా మాత్రమే ఆమెను దండించాలి. అయితే ఆమెను లాగిపెట్టి ముఖం మీద కొట్టడం, ముక్కు మీద గుద్దడం.. తల మీద బాదడం లాంటివి చేయకూడదు. రక్తం వచ్చేలా కూడా కొట్టకూడదు’ అని చెప్పడమే కాక ఎలా కొట్టాలో ఓ డెమో కూడా చేసి చూపించాడు సదరు సోషియాలజిస్ట్.
ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటంటే.. పదేళ్ల పిల్లాడి మీద ఈ డెమో చేసి చూపించడం. అంటే ఇప్పటి నుంచే ఆ చిన్న బుర్రలోకి మహిళ అంటేనే ఓ సరుకు అని.. దాని మీద మగవాడికి పూర్తి హక్కు ఉందనే పాఠాన్ని బలంగా ఎక్కిచ్చేస్తున్నాడీ ప్రబుద్ధుడు.
Comments
Please login to add a commentAdd a comment