FIFA WC 2022: Poland National Team Escorted By-F-16 Jets To-Qatar Viral - Sakshi
Sakshi News home page

FIFA WC 2022: ఫిఫా చరిత్రలోనే తొలిసారి.. ఫైటర్‌ జెట్స్‌ సాయంతో ఖతార్‌కు పోలాండ్‌

Published Fri, Nov 18 2022 6:20 PM | Last Updated on Fri, Nov 18 2022 7:25 PM

FIFA WC 2022: Poland National Team Escorted By-F-16 Jets To-Qatar Viral - Sakshi

విశ్వవ్యాప్తంగా యమ క్రేజ్‌ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ సమరానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే సాకర్‌ సమరంలో పాల్గొననున్న 32 జట్లు ఖతార్‌కు చేరుకున్నాయి. ఇక నవంబర్‌ 20 నుంచి గోల్స్‌ వర్షం మొదలుకానుంది. ఇదిలా ఉంటే ఖతార్‌ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు పోలాండ్‌ జట్టు ఫైటర్‌ జెట్స్‌ ఎస్కార్ట్‌తో రావడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బహుశా ఫిఫా వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఒక జట్టు ఎస్కార్ట్‌తో రావడం ఇదే తొలిసారి అనుకుంటా.

పోలాండ్‌ ఇలా ఎస్కార్ట్‌తో రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదే రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై తొమ్మిది నెలలు కావొస్తున్నప్పటికి ఇప్పటికి మిస్సైల్‌ దాడులు జరగుతూనే ఉన్నాయి. అయితే పోలాండ్‌ రష్యా-ఉక్రెయిన్‌లకు బార్డర్‌ దేశంగా ఉంది. పోలండ్‌ జట్టు ఫిఫా వరల్డ్‌కప్‌ జరగనున్న ఖతార్‌కు వెళ్లాలంటే ఈ రెండు దేశాల ఎయిర్‌బేస్‌ను దాటుకొని వెళ్లాల్సిందే. ఈ మధ్యనే ఉక్రెయిన్‌-పోలాండ్‌ బార్డర్‌లో రష్యా జరిపిన దాడిలో ఇద్దరు పోలాండ్‌ వ్యక్తులు కూడా మృతి చెందారు.

ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న పోలాండ్‌ దేశం తమ ఫుట్‌బాల్‌ టీం ఖతార్‌కు వెళ్లాలంటే ఎస్కార్ట్‌ తప్పనిసరన్న విషయాన్ని గుర్తించింది. అందుకే ఖతార్‌కు బయలుదేరిన పోలాండ్‌ జట్టు విమానానికి ఫైటర్‌ జెట్‌-16ను ఎస్కార్ట్‌గా పంపింది. మధ్యలో విమానం వెళ్లగా.. ఇరువైపులా ఫైటర్‌ జెట్స్‌-16 ఎస్కార్ట్‌గా వెళ్లాయి. ఇది చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది.

ఇక విమానం ఖతార్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయిన తర్వాత ఫైటర్‌ జెట్స్‌ మళ్లీ పోలాండ్‌కు చేరుకున్నాయి. ఇదే విషయాన్ని పోలాండ్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ తమ ట్విటర్‌లో వీడియో రూపంలో షేర్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి రష్యా-ఉక్రెయిన్‌ల యుద్ధం కారణంగా భయపడిన పోలాండ్‌ జట్టు ఎలాగోలా ఎస్కార్ట్‌ సాయంతో ఖతార్‌లో అడుగుపెట్టింది. ''ఫిఫా చరిత్రలోనే ఒక జట్టు ఇలా ఎస్కార్ట్‌తో వెళ్లడం ఇదే తొలిసారి'' అంటూ అభిమానులు కామెంట్‌ చేశారు.

ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో పోలాండ్‌ జట్టు గ్రూప్‌-సిలో ఉంది. ఇదే గ్రూప్‌లో మెక్సికో, అర్జెంటీనా, సౌదీ అరేబియాలు కూడా ఉన్నాయి. కాగా పోలాండ్‌ వచ్చే మంగళవారం మెక్సికోతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. ప్రస్తుతం టాప్‌ స్టార్స్‌లో ఒకడిగా ఉన్న రాబర్ట్‌ లెవాండోస్కీ పోలాండ్‌ జట్టు కెప్టెన్‌గా ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న రాబర్ట్‌ లెవాండోస్కీనే జట్టుకు పెద్ద బలం అని చెప్పొచ్చు. ఆ తర్వాత నవంబర్‌ 26న సౌదీ అరేబియాతో తలపడనుంది. ఇక చివరగా నవంబర్‌ 30న మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనాతో మ్యాచ్‌ ఆడనుంది. 1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో నాకౌట్‌ దశకు చేరిన పోలాండ్‌ మళ్లీ ఒక్కసారి కూడా గ్రూప్‌ దశ దాటలేకపోయింది.

చదవండి: 'నా చేతులతో శుభ్రం చేశా.. ఎంత పనిమంతులో అర్థమైంది'

FIFA: 'మెస్సీ నా స్నేహితుడే కాదు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement