సాక్షి, బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2018 వేలానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం పాట జరుగుతుంది. ఈ విషయాన్ని శనివారం బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ఈ వేలానికి టాప్ క్రికెటర్లతో పాటు మొత్తం 1122 మంది క్రికెటర్లు రిజిస్ట్రర్ చేసుకున్నారు. ఎనిమిది ఫ్రాంచైజీలు తాము అట్టి పెట్టుకున్న ఆటగాళ్లను బీసీసీఐకు సమర్పించాయి. ఈ జాబితాలో 281 మంది అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు, ఇంకా ఆరంగేట్రం చేయని 838 మంది కొత్తవారు ఉన్నట్లు బీసీసీఐ పేర్కొంది.
ఐపీఎల్ వేలంలో భారత్ నుంచి 778 మంది ఆటగాళ్లు ఉన్నారని, అసోసియేట్ దేశాలకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఉన్నట్లు బీసీసీఐ వెల్లడించింది. వేలానికి అందుబాటులో ఉండే ఆటగాళ్ల పూర్తి జాబితాను ఎనిమిది ఫ్రాంఛైజీలకి పంపినట్లు వివరించిన బోర్డు.. భారత్ తర్వాత ఆస్ట్రేలియా నుంచే ఎక్కువ మంది క్రికెటర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఆస్ట్రేలియా నుంచి 58 మంది, దక్షిణాఫ్రికా (57), శ్రీలంక, వెస్టిండీస్ నుంచి 39 మంది చొప్పున వేలంలోకి రానున్నారు. న్యూజిలాండ్ (30), ఇంగ్లండ్ (26) ఆటగాళ్లు కూడా గతంతో పోలిస్తే.. ఈ ఏడాది ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్లు జాబితా స్పష్టం చేస్తోంది. ఈ వేలంలో క్రిస్‌గేల్, మాక్స్‌వెల్, హషీమ్ ఆమ్లా, కేన్ విలియమ్సన్, కొలిన్ మన్రో, టామ్ లాథమ్, రబడా తదితరులు వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
భారత్ నుంచి గౌతమ్ గంభీర్, అశ్విన్, అజింక్య రహానే, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్, ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌ల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్-11వ సీజన్ ఏప్రిల్ 4 న ప్రారంభమై మే 31తో ముగుస్తుంది. ఏ ఆటగాళ్లు ఏ జట్టులో ఆడనున్నారో, ఈ సీజన్‌లో ఏ ప్లేయర్ ఎక్కువ ధర పలుకుతారో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment