ఆహా... పిడుగా!
స్కేటింగ్‌లో చిన్నారి గిన్నీస్ రికార్డు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 39 టొయోటా క్వాలిస్ కార్ల కింద కేవలం 28 సెకన్లలో స్కేటింగ్ ద్వారా రయ్‌మని దూసుకొచ్చేశాడు చిచ్చర పిడుగు గగన్. స్థానిక బసవేశ్వర నగరలోని ఫ్లోరెన్స్ స్కూలులో కిండర్ గార్టెన్ విద్యార్థి అయిన ఐదేళ్ల గగన్‌కు స్కేటింగ్ అంటే ఎంతో ఇష్టం. ఏడాదిన్నర కిందట స్కేటింగ్ క్లాసులో చేరాడు.
అతని తండ్రి సతీశ్ వాషింగ్ మెషిన్ సర్వీసు సెంటర్‌లో పని చేస్తున్నాడు. స్కేటింగ్‌పై కుమారునికున్న శ్రద్ధాసక్తులను గమనించి, ఇందులో అతను ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యంతో ప్రోత్సహించాడు. గిన్నీస్ రికార్డు కోసం 39 టొయోటా కార్లను వరుసగా 69.2 మీటర్ల దూరం మేరకు నిలిపి ఉంచారు. భూమికి, కార్ల ఛాసిస్‌లకు మధ్య దూరం కేవలం 8 అంగుళాలే. గతంలో రాష్ట్రంలోని బెల్గాంకు చెం దిన తొమ్మిదేళ్ల రోహన్ 47 సెకన్లలో 24 కార్ల కింద స్కేటింగ్ చేశాడు. ఆ రికార్డును గగన్ బద్దలు కొట్టాడు.