వేలంలో 8 మంది స్టార్ ఆటగాళ్లు
♦ జాబితాలో యువీ, ఇషాంత్
♦ 6న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం
న్యూఢిల్లీ: ఐపీఎల్ తొమ్మిదో సీజన్ కోసం ఫిబ్రవరి 6న జరిగే వేలానికి 351 మంది ఆట గాళ్లు అందుబాటులో ఉండనున్నారు. స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, పేసర్ ఇషాంత్ శర్మతో పాటు ఎనిమిది మంది ప్రముఖ ఆటగాళ్లు కూడా ఇందులో ఉన్నారు. బెంగళూరులో ఈ వేలం జరుగుతుంది.
ఓవరాల్‌గా ఈ వేలంలో 230 మంది భారత ఆటగాళ్లు కాగా 131 మంది విదేశీ క్రికెటర్లున్నారు. ఇతర ఆరుగురు స్టార్ ఆటగాళ్లలో షేన్ వాట్సన్, ఆరోన్ ఫించ్, స్టెయిన్, స్మిత్, గప్టిల్, పీటర్సన్ ఉన్నారు. మరోవైపు 130 మంది క్యాప్‌డ్ క్రికెటర్లలో 29 మంది ఆసీస్‌కు చెందినవారే ఉన్నారు. భారత్ నుంచి 127 మంది ఉన్నారు. 204 మంది అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లున్నారు.
=ఇక యువీ, ఇషాంత్ భారత్ నుంచి ప్రముఖ ఆటగాళ్లు కావడంతో పాటు వేలంలో వీరు ఫ్రాంచైజీలను ఏమేరకు ఆకట్టుకోనేది ఆసక్తికరంగా మారింది. గతంలో అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించిన యువరాజ్ గత రెండు సీజన్ల నుంచి బెంగళూరు, ఢిల్లీ జట్ల నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఇషాంత్ హైదరాబాద్ జట్టు నుంచి విడుదలయ్యాడు.