చెన్నై: ఫిట్‌నెస్ కాపాడుకోవడం కోసం ఇకపై పరిమిత సంఖ్యలోనే టోర్నీల్లోనే ఆడతానని ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించాలంటే ఫిట్‌గా ఉండాలని, అందుకోసం ప్రతీ టోర్నీ ఆడకుండా కొన్ని టోర్నీల్లోనే ఆడతానని ఆమె తెలిపింది. చెన్నైలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ‘ఇది ఒలింపిక్ ఏడాది. దీని ముందు జరిగే ప్రతీ టోర్నమెంట్ ముఖ్యమైనదే. అయితే గాయాల బారిన పడకుండా ఫిట్‌గా ఉండేందుకు కొన్ని టోర్నీలే ఆడతా. ఎప్పుడైతే మనం మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉంటామో అప్పుడే మనం ఆడే టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేయగలం. కోట్లాది భారతీయుల దీవెనలు, మద్దతుతో ఈసారి పసిడి గెలవడానికి ప్రయత్నిస్తా’ అని అన్నారు. అయితే గత ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయం ప్రకారం... సింగిల్స్‌లో టాప్–15లో ఉన్న క్రీడాకారులు, డబుల్స్‌లో టాప్–10 ఉన్న జోడీలు ప్రతి ఏడాది 15 వరల్డ్ టూర్‌లలో కనీసం 12 టోర్నీలు ఆడాలి. లేకపోతే పెనాల్టీ ఎదురుకోవల్సి వస్తుంది.
కమల్ హాసన్‌ను కలిసిన సింధు
విఖ్యాత నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎమ్‌ఎన్‌ఎమ్) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌ను సింధు ఇక్కడి ఎమ్‌ఎన్‌ఎమ్ పార్టీ ఆఫీసులో కలిసింది. అయితే ఇది రాజకీయ భేటీ కాదని కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. ఇటీవలే ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధు పసిడి గెలవడం దేశమంతా గర్వించదగ్గ అంశం అని ఆమె ఘనతను కొనియాడారు. చెన్నైలో బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేయాల్సిందిగా సింధుని కోరానని ఆయన తెలిపారు. కమల్ హాసన్ తన అభిమాన నటుడని, అతనో సూపర్ స్టార్ అని సింధు వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment