ఎవర్నీ ఉపేక్షించకూడదు: కుక్
లండన్: క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ స్పష్టం చేశాడు. ఏ స్థాయి క్రికెటరైనా ఫిక్సింగ్కు పాల్పడినట్లు రుజువైతే జీవిత కాలం నిషేధం ఒక్కటే తగిన పరిష్కారమని సూచించాడు. ఎవరైనా ఫిక్సింగ్ చేస్తూ పట్టుబడినట్లైతే ఆ క్రికెటర్కు వేసే శిక్ష చాలా కఠినంగా ఉండాలనేది తన అభిప్రాయంగా కుక్ తెలిపాడు. ఆ రకంగా చేసినప్పుడు క్రికెటర్లు నిజాయితీతో గేమ్ను ఆస్వాదిస్తారన్నాడు.
అయితే ఫిక్సింగ్ పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న తరువాత తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు రాబోతున్న మొహ్మద్ ఆమిర్ కు, తాను మాట్లాడే దానికి ఎటువంటి సంబంధం లేదన్నాడు. అప్పటి నిబంధనలు భిన్నంగా ఉన్న నేపథ్యంలో ఆమిర్ పునరాగమనం గురించి మాట్లాడటం సబబు కాదని కుక్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తాము ఆమిర్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కుక్ తెలిపాడు. అతనితో ఆడటానికి ఇంగ్లండ్ జట్టుకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నాడు. ఇక నుంచి ఎవరైనా మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లైతే జీవిత కాల నిషేధం ఒక్కటే సరైన మార్గమన్నాడు.