మూడో 'అతిపెద్ద' ఇన్నింగ్స్!
అబుదాబి: టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పాకిస్థాన్ తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీతో విశేషంగా రాణించిన కుక్ మరో ఘనతను కూడా సాధించాడు. కుక్ (528 బంతుల్లో 263; 18 ఫోర్లు) ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఈ స్కోరును చేసే క్రమంలో కుక్ సుదీర్ఘంగా 836 నిమిషాల పాటు క్రీజ్ లో ఉన్నాడు. దాదాపు 14 గంటల పాటు క్రీజ్ ను అంటిపెట్టుకుని ఇంగ్లండ్ కు కీలక ఇన్నింగ్స్ సాధించిపెట్టాడు.
అంతకుముందు ఈ ఘనతను సాధించిన వారిలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు హానిఫ్ మహ్మద్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిరెస్టన్ లు ఉన్నారు. 1958 లో బ్రిడ్జిటౌన్ లో వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో 970 నిమిషాల పాటు క్రీజ్ లో ఉండి 337 పరుగులు సాధించిన హనీఫ్ అగ్రస్థానంలో ఉండగా, 1999లో డర్బన్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 878 నిమిషాలు క్రీజ్ లో ఉండి 275 పరుగులను సాధించిన గ్యారీ కిరెస్టన్ రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా కుక్ ఆడిన ఇన్నింగ్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో మూడో అతిపెద్ద ఇన్నింగ్స్ గా రికార్డులకెక్కింది.