స్టార్ బౌలర్పై స్వాన్ సంచలన వ్యాఖ్యలు!
లండన్: గత ఆరు సంవత్సరాల క్రితం తమతో టెస్టు మ్యాచ్ సందర్బంగా స్పాట్ ఫిక్సింగ్ పాల్పడిన పాకిస్తాన్ స్టార్ పేసర్ మొహ్మద్ ఆమిర్పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఆమిర్ను తిరిగి క్రికెట్లో ఎందుకు ఆహ్వానించారంటూ తీవ్రంగా మండిపడ్డాడు. జీవిత కాలం నిషేధం విధించాల్సిన బౌలర్కు పునరాగమనం ద్వారా ఆడే అవకాశం కల్పించడం కచ్చితంగా పెద్ద తప్పిదమేనని పేర్కొన్నాడు.
'2010లో నో బాల్స్ వేయడం ద్వారా ఫిక్సింగ్ కు పాల్పడిన ఆమిర్ పై జీవితం కాలం నిషేధం విధించి ఉండాల్సింది. ఆటలో పారదర్శకతను కోరితే అటువంటి వారిని తిరిగి జట్టులో ఆడే అవకాశం ఎందుకు కల్పిస్తారు. ఆమిర్ లాంటి వాళ్లను అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడే అవకాశం లేకుండా చేస్తే అది క్రికెట్ ఎదుగుదలకు దోహద పడుతుంది. దాంతో పాటు యువ క్రికెటర్లకు కూడా అదొక ఆదర్శవంతంగా నిలుస్తుంది. అవినీతికి పాల్పడే వారికి జట్టులో స్థానం అనేది ఉండకూడదు 'అని స్వాన్ ధ్వజమెత్తాడు.
అయితే అంతకుముందు ఆమిర్ పై తమకు ఎటువంటి ద్వేషం లేదని ఇంగ్లండ్ క్రికెట్ జట్టులోని సభ్యులు కొందరు మద్దుతుగా నిలిచిన సంగతి తెలిసిందే. అటు కెప్టెన్ అలెస్టర్ కుక్ తో పాటు, స్టువర్ట్ బ్రాడ్ లు ఆమిర్ ను స్వాగతిస్తున్న తరుణంలో ఆ దేశానికే చెందిన స్వాన్ భిన్నమైన వైఖరి వ్యక్తం చేయడం గమనార్హం.