'అమిత్ మిశ్రా అస్సలు పట్టించుకోలేదు'
బెంగళూరు: క్రికెటర్ అమిత్ మిశ్రాపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని మొదట అనుకున్నానని అతడి స్నేహితురాలు, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ తెలిపింది. అయితే తాను పెట్టిన కేసు గురించి అమిత్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నానని వెల్లడించింది.
'కేసు ఉపసంహరించుకోవాలని మొదట్లో అనుకున్నా. కానీ కేసు గురించి అమిత్ మిశ్రా అసలు పట్టించుకోకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకున్నా. ఇప్పుడు కేసు కోర్టు, పోలీసుల ముందు ఉంది. తర్వాత ఏం జరుగుతుందనేది వారే తేలుస్తారు' అని వందన పేర్కొంది.
తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అమిత్ మిశ్రా దాడికి పాల్పడినట్టు సెప్టెంబర్ 27న అశోక్ నగర్ పోలీసు స్టేషన్‌లో వందన ఫిర్యాదు చేసింది. దీంతో అమిత్ మిశ్రాను బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మూడు గంటల విచారణ అనంతరం 'స్టేషన్ బెయిల్'పై విడుదల చేశారు.