రెండు తరాల మధ్య పోరాటం
64 గడులు.. ఎత్తులు మాత్రం అనంతం... చెస్ బాగా ఆడే వ్యక్తిని మేథావి అనడం అతిశయోక్తి కాదు. అలాంటి చెస్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడెవరో తేల్చుకునే పోరాటం ప్రపంచ చాంపియన్‌షిప్. ఈసారి ఈ మెగా ఈవెంట్‌కు చెన్నై ఆతిథ్యమిస్తోంది. ఈ నెల 9 నుంచి 27 వరకు విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్‌సెన్ ఈ మెగా టైటిల్ కోసం పోరాడనున్నారు. ఆనంద్ డిఫెండింగ్ చాంపియన్ కాగా... కార్ల్‌సెన్ ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు.
విశ్వనాథన్ ఆనంద్ తర్వాత భారత్‌లో చెస్ ఖ్యాతిని పెంచిన ఆటగాడు పెంటేల హరికృష్ణ. ఆనంద్ ఏం ఆడుతున్నాడు..? టోర్నీ ఎలా జరుగుతోంది..? ఎవరు ఎక్కడ తప్పు చేశారు..? ఎవరికి గెలిచే అవకాశం ఉంది..? ఇలాంటి ప్రశ్నలకు అందరికంటే బాగా సమాధానం చెప్పగలిగే వ్యక్తి హరికృష్ణ. ఈ భారత గ్రాండ్ మాస్టర్, తెలుగుతేజం...ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సంబంధించిన ప్రివ్యూ, గేమ్‌ల విశ్లేషణలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తాడు.
పెంటేల హరికృష్ణ
ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య ప్రపంచ టైటిల్ పోరాటం కోసం మొత్తం చెస్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ పోరుపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది రెండు తరాల మధ్య పోరాటం. ఇద్దరి మధ్యా 20 ఏళ్లకు పైగా వయసు వ్యత్యాసం ఉంది. బోట్వినిక్-తాల్‌ల మధ్య పోరాటం తర్వాత ఇంత వయసు తేడా ఉన్న ఆటగాళ్లు తలపడలేదు. అంతేకాదు... చాంపియన్ కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న వ్యక్తి టైటిల్ కోసం తలపడటం కూడా 1972 (ఫిషర్-స్పాష్కీల మ్యాచ్) తర్వాత ఇప్పుడే.
క్లాసికల్ చెస్‌లో కార్ల్‌సన్ మీద ఆనంద్‌కు 6-3 విజయాల రికార్డు ఉంది. కానీ గత రెండు సంవత్సరాల్లో కార్ల్‌సెన్... ప్రపంచ చాంపియన్ మీద రెండుసార్లు గెలిచాడు. వీరిద్దరి ముఖాముఖి పోరులో 2007, 08,10 సంవత్సరాల్లో ఆనంద్ గెలిస్తే... 2009, 12,13 సంవత్సరాల్లో ప్రత్యర్థి నెగ్గాడు. ఇద్దరి విజయాలను జాగ్రత్తగా పరిశీలిస్తే... మెరుగైన సన్నాహకాలు, అనుభవం ఆనంద్‌ను గెలిపించాయి. సాధారణంగా ప్రారంభంలోనే ఆనంద్ అడ్వాంటేజ్ తీసుకుని ఆ ఒత్తిడిని చివరి వరకూ కొనసాగిస్తాడు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే నల్లపావులతో ఆనంద్ కార్ల్‌సన్ మీద గెలిచాడు. మరోవైపు కార్ల్‌సెన్ గెలిచినవన్నీ తెల్లపావులతో ఆడినవే. ఎండ్‌గేమ్‌లో కాస్త మెరుగ్గా ఆడటం వల్ల తనకి విజయాలు వచ్చాయి.
2012లో బిల్బావోలో జరిగిన గేమ్‌లో విజయం ఆనంద్‌పై కార్ల్‌సెన్‌కు అత్యుత్తమం. ఆనంద్ బాగా ఆడినా కార్ల్‌సెన్ 30 ఎత్తుల్లో గెలిచాడు. వీళ్లిద్దరి మధ్య చివరిసారి 2013లో తాల్ మెమోరియల్ టోర్నీలో గేమ్ జరిగింది. ఇందులోనూ 30 ఎత్తుల్లోపే కార్ల్‌సన్ నెగ్గాడు. ఈ విజయం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 2012లో లండన్‌లో, 2013లో నార్వేలో జరిగిన రెండు గేమ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ రెండు గేమ్‌ల్లోనూ ఆనంద్ నల్లపావులతో ఆడి ఒత్తిడిలోకి వెళ్లినా... పుంజుకుని డ్రాలు చేశాడు. మొత్తంమీద తెల్లపావులతో ఆడుతున్నప్పుడు కార్ల్‌సన్ ప్రమాదకారి.