ముస్తాక్ అలీ ట్వంటీ 20 ట్రోఫీలో వేర్వేరు చోట్ల జరిగిన మ్యాచ్ ల్లో ఆంధ్ర, హైదరాబాద్ జట్లు ఓటమి చెందాయి.
వడోదర: ముస్తాక్ అలీ ట్వంటీ 20 ట్రోఫీలో వేర్వేరు చోట్ల జరిగిన మ్యాచ్ ల్లో ఆంధ్ర, హైదరాబాద్ జట్లు ఓటమి చెందాయి. గ్రూప్-సిలో మధ్య ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆంధ్ర ఐదు వికెట్లతో పరాజయం చెందగా, గ్రూప్-ఏలో బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమి పాలైంది.
వడోదరలోని రిలయన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఆంధ్ర టాపార్డర్ లో భరత్(9),ప్రశాంత్(3),శ్రీకాంత్(9), ప్రదీప్(0), అశ్విన్ హెబర్(15) ఘోరంగా విఫలం చెందడంతో జట్టు వంద మార్కులు అంకెను కూడా చేరలేదు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన మధ్యప్రదేశ్ 18.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. మధ్యప్రదేశ్ ఆటగాళ్లలో హర్ ప్రీత్ సింగ్(40 నాటౌట్) రాణించగా, సహాని(22), ధలివాల్(25 నాటౌట్)లు విజయంలో సహకరించారు.
నాగ్ పూర్ లో జరిగిన మరో మ్యాచ్ లో హైదరాబాద్ 61 పరుగుల తేడాతో బెంగాల్ చేతిలో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసి బెంగాల్ విసిరిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ 16.2 ఓవరల్లో 124 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.