
జైపూర్: ఓపెనర్ జ్ఞానేశ్వర్ (175 బంతుల్లో 73; 10 ఫోర్లు, సిక్స్), వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్ (100 బంతుల్లో 52; 8 ఫోర్లు, సిక్స్), బౌలర్ శశికాంత్ (97 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించడంతో... రాజస్తాన్‌తో జరుగుతోన్న రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుకు 106 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోర్ 82/2తో రెండో రోజు శనివారం ఆట కొనసాగించిన ఆంధ్ర 91.5 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. రాజస్తాన్ బౌలర్ రితురాజ్ సింగ్ (4/36) రాణించాడు. ఆట ముగిసే సమయానికి రాజస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది. శశికాంత్, షోయబ్ చెరో వికెట్ సాధించారు. ప్రస్తుతం యశ్ కోఠారి (11 బ్యాటింగ్; ఫోరు), మహిపాల్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే రాజస్తాన్ మరో 83 పరుగులు చేయాల్సి ఉంది.
సుమంత్ సూపర్ ఇన్నింగ్స్...
హైదరాబాద్ వేదికగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. కొల్లా సుమంత్ (157 బంతుల్లో 91 బ్యాటింగ్; 11 ఫోర్లు) వీరోచిత బ్యాటింగ్ కారణంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 68 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. దీంతో 29 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. అంతకుముందు కేరళ తమ తొలి ఇన్నింగ్స్‌లో 51.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్ (4/59), రవి కిరణ్ (4/39) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment