హెచ్‌సీఏలో భారీ కుంభకోణం!
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు రూ.120 కోట్ల కుంభకోణం జరిగినట్లు డిలైట్ సంస్థ దర్యాప్తులో వెల్లడి కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. గత శుక్రవారం కూడా హెచ్‌సీఏ సభ్యులపై ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
గత నెల 20వ తేదీన నిర్వహించిన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో రోజూవారీ బాధ్యతల నిర్వహణకై అడ్‌హక్ కమిటీ చైర్మన్‌గా ప్రకాష్‌చంద్ జైన్ (56)ను నియమించారు. ఈ నెల 5వ తేదీన, 16వ మరోసారి విధుల నిమిత్తం స్టేడియంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడ వుండే సెక్యూరిటీ లోనికి వెళ్లకుండా తనను అడ్డుకున్నారని, కుట్ర జరుగుతుందంటూ ప్రకాష్‌చంద్ ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంభకోణం జరిగినట్లు ప్రైవేట్ సంస్థ దర్యాప్తులో వెల్లడికావడం పలు అనుమానాలకు దారితీసింది.