
సన్ రైజర్స్ కు ఎదురుదెబ్బ
:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్ లో వరుస విజయాలతో ప్లే ఆఫ్ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఎదురుదెబ్బ తగిలింది.
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్ లో వరుస విజయాలతో ప్లే ఆఫ్ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమ్యాడు. తొడ కండరాల గాయంతో ఆశిష్ నెహ్రా ఐపీఎల్ నుంచి వైదొలిగినట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం గురువారం వెల్లడించింది. గత నాలుగు రోజుల క్రితం కింగ్స్ పంజాబ్ తో మ్యాచ్ సందర్భంగా ఆశిష్ నెహ్రా తొడ కండరాలు పట్టేయడంతో టోర్నీ మొత్తానికి దూరమవుతున్నట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు సన్ రైజర్స్ హైదరాబాద్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. 'ఇక ఈ ఐపీఎల్ సీజన్ లోని మిగతా మ్యాచ్ లకు నెహ్రా అందుబాటులో ఉండటం లేదు. అతని గాయానికి ఆర్థోపెడిక్ వద్ద చికిత్స తీసుకుంటున్నాడు. నెహ్రాకు కొన్ని వారాలు విశ్రాంతి అవసరం. గాయం నుంచి తేరుకున్నాక కాంపిటేటివ్ క్రికెట్ లో నెహ్రా అడుగుపెట్టే అవకాశం ఉంది. మా కీలక బౌలర్ నెహ్రా సేవలను కోల్పోవడం నిజంగా బాధకరం' అని సన్ రైజర్స్ తెలిపింది. ఇప్పటివరకూ సన్ రైజర్స్ ఆడిన 12 మ్యాచ్ లకు గాను ఎనిమిది మ్యాచ్ లాడిన నెహ్రా 7.76 ఎకానమీ రేట్ తో తొమ్మిది వికెట్లు సాధించాడు. అతని బెస్ట్ బౌలింగ్ 3/15 గా నమోదైంది.