కొత్త కెరటం...
బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న ఆశిష్ రెడ్డి
సాక్షి క్రీడా విభాగం: కొన్నాళ్ల క్రితం అనంతపురంలో ‘యంగ్ మాస్టర్స్’ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగింది. అందులో పదిహేనేళ్ల కుర్రాడు తన పదునైన ఆట తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. అండర్–17 స్థాయిలో జరిగిన ఆ టోర్నీలో తుది విజేతగా నిలవకున్నా తన ఆటతో ఆకట్టుకున్నాడు. ‘బెస్ట్ స్మాషర్’ అవార్డును సొంతం చేసుకున్న ఆ యువ షట్లర్ పేరు ఎం.పరమేశ్ ఆశిష్‌రెడ్డి. అదే ఉత్సాహంతో దూసుకుపోయిన ఆశిష్... అగ్ర శ్రేణి టోర్నీలలో నిలకడగా విజయాలు సాధించాడు.
సత్తా చాటుతూ...
అనంతపురం జిల్లాకు చెందిన ఆశిష్, నంద్యాలలోని నంది పైప్స్ అకాడమీలో ప్రాథమికాంశాలు నేర్చుకున్నాడు. అక్కడి కోచ్ వెంకట్ వద్ద శిక్షణలో రాటుదేలిన తర్వాత వివిధ టోర్నీలలో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. అనంతపురంలో నిర్వహించిన అండర్–15 టోర్నీలో రన్నరప్‌గా ఉన్న అతను, తర్వాతి ఏడాది జరిగిన అండర్–17 విభాగంలో విజేతగా నిలవడం విశేషం. అనంతరం ‘సాక్షి’ మీడియా నిర్వహించిన యూత్ ఎరీనా ఫెస్ట్‌లో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచిన ఆశిష్, చక్కటి ఆటతీరును కనబర్చాడు. అనేక ర్యాంకింగ్ టోర్నీలలో కూడా పాల్గొన్న ఆశిష్ రెడ్డి, 2017లో ఏపీ బ్యాడ్మింటన్ సంఘం నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్ చాంపియన్‌షిప్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నంద్యాలలో గత జులైలో జరిగిన ఈ టోర్నీ అండర్–19 సింగిల్స్ విభాగంలో అతను సెమీఫైనల్ వరకు చేరుకున్నాడు. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయినా... మంచి భవిష్యత్తు ఉన్న షట్లర్‌గా ప్రశంసలు అందుకున్నాడు.
ఇదే టోర్నీలో సాయినాథ్ రెడ్డితో కలిసి అతను డబుల్స్ విభాగంలో కూడా పోటీ పడ్డాడు. చదువులో కూడా చురుకైన విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్న ఇతను... ప్రస్తుతం హైదరాబాద్‌లో మరింత మెరుగైన శిక్షణతో తన ఆటలో రాటుదేలేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆశిష్ ఆటను మరింత ప్రోత్సహించి అండగా నిలిచేందుకు ఎవరైనా స్పాన్సర్లు ఆసక్తి చూపిస్తే ఈ యువ ఆటగాడు మున్ముందు మరింత సంచలన విజయాలు సాధించడం ఖాయం. ఈ యువ షట్లర్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించాలనుకునేవారు 7729942589 ఫోన్ నంబర్‌లో సంప్రదించగలరు.
బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ స్థాయికి ఎదగడమే నా లక్ష్యం. అందు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాను. గత రెండేళ్లలో నా ఆట ఎంతో మెరుగైంది. కోచ్ వెంకట్ సార్ పర్యవేక్షణలో నా లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందు కోసం సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేస్తున్నా. ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు
సాధించాలని పట్టుదలగా ఉన్నా.
– ఆశిష్ రెడ్డి, యువ షట్లర్