అశ్విన్ అరుదైన ఘనతలు..
గ్రాస్ ఐలెట్: వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ మెరుపులు మెరిపిస్తున్న అశ్విన్ తాజాగా అరుదైన ఫీట్ను నమోదు చేశాడు. ఒక సిరీస్లో రెండు సార్లు ఐదు వికెట్లకు పైగా తీయడంతో పాటు, రెండు సార్లు 50కు పైగా పరుగులు నమోదు చేసిన మూడో భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఈ ఫీట్ ను కపిల్ దేవ్ రెండు సార్లు, భువనేశ్వర్ కుమార్ ఒకసారి సాధించారు.1979-80లో పాకిస్తాన్పై, 1981-82లో ఇంగ్లండ్పై కపిల్ దేవ్ ఈ ఘనతను నమోదు చేయగా, రెండు సంవత్సరాల క్రితం ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ లో భువనే్శ్వర్ కుమార్ రెండుసార్లు ఐదేసి వికెట్లను, 50కు పైగా స్కోరును రెండు సార్లు సాధించాడు.
నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో సెంచరీ చేయడంతో పాటు ఏడు వికెట్లు సాధించిన అశ్విన్.. రెండో టెస్టులో (మొత్తం ఆరువి కెట్లు) తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశాడు. మరోవైపు మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో శతకంతో మెరిశాడు. ఈ క్రమంలో అశ్విన్ తన టెస్టు కెరీర్ లో సాధించిన నాల్గో శతకం కూడా విండీస్ పైనే రావడం మరో విశేషం. దీంతో భారత ఆటగాళ్ల ప్రతిష్టాత్మక క్లబ్లో అశ్విన్ కు చోటు దక్కింది. అంతకుముందు సునీల్ గవాస్కర్(13 సెంచరీలు), దిలీప్ వెంగసర్కార్ (ఆరు సెంచరీలు), రాహుల్ ద్రవిడ్ (ఐదు సెంచరీలు) మాత్రమే విండీస్పై అత్యధిక టెస్టు సెంచరీలు నమోదు చేశారు.
మూడో టెస్టులో అశ్విన్ (297 బంతుల్లో 118; 6 ఫోర్లు; 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (227 బంతుల్లో 104; 13 ఫోర్లు) శతకాలతో ఆదుకున్నారు. దీంతో కోహ్లిసేన తొలి ఇన్నింగ్స్‌లో 129.4 ఓవర్లలో 353 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది.