కివీస్ ను తిప్పేశారు!
ఇండోర్: చివరిదైన మూడో టెస్టులో తొలి రెండు రోజులో బ్యాటింగ్ పూర్తి ఆధిపత్యం కనబరచిన భారత్.. ఆ తరువాత బౌలింగ్ లో కూడా విజృంభించి న్యూజిలాండ్ను కుప్పకూల్చింది. భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ చెలరేగిపోవడంతో కివీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 299 పరుగులకే ఆలౌటైంది.
28/0 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ కు గప్టిల్(72), లాధమ్(53) లు మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ ఓవర్ నైట్ ఓపెనర్లు ఇద్దరూ భారత్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 118 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే లాధమ్ తొలి వికెట్ గా అవుటైన తరువాత కివీస్ పతనం ఆరంభమైంది. కేవలం 30 పరుగుల వ్యవధిలో మరో నాలుగు వికెట్లను నష్టపోవడంతో కివీస్ తేరుకోలేకపోయింది. ఈ రోజు ఆటలో లంచ్ విరామానికి 125/1 తో దీటుగా బదులిస్తున్నట్లు కనిపించిన కివీస్ ఆపై వరుసగా కీలక వికెట్లను చేజార్చుకుంది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో లాధమ్, గప్టిల్ తరువాత నీషామ్(71) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
భారత బౌలర్లు అశ్విన్ ఆరు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించగా, జడేజాకు రెండు వికెట్లు లభించాయి. మరో రెండు వికెట్లు రనౌట్లు రూపంలో వచ్చాయి. దీంతో భారత్ కు 258 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్ ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది.