అశ్విన్ పండుగ చేసుకున్నాడు | After Lunch, R Ashwin feasts on New Zealand batsmen | Sakshi
Sakshi News home page

అశ్విన్ పండుగ చేసుకున్నాడు

Published Tue, Oct 11 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM

అశ్విన్ పండుగ  చేసుకున్నాడు

అశ్విన్ పండుగ చేసుకున్నాడు

ఆరు వికెట్లతో చెలరేగిన స్పిన్నర్
తొలి ఇన్నింగ్‌‌సలో న్యూజిలాండ్ 299 ఆలౌట్
భారత్‌కు 258 పరుగుల భారీ ఆధిక్యం 

ఫాలోఆన్ ఇవ్వని కోహ్లి సేన 
రెండో ఇన్నింగ్‌‌సలో 18/0  

 
సెంచరీలు, డబుల్ సెంచరీలు స్కోరుబోర్డులో భారీగా కనిపించినా... అశ్విన్ చేయి పడితే కానీ భారత్ గెలుపు రథం ముందుకు కదిలేలా లేదు! ఊహించని రీతిలో న్యూజిలాండ్ ఓపెనర్లు చెలరేగిపోతుండగా, ముందుగా ఆ జోడీని విడదీసి కివీస్ పతనానికి శ్రీకారం చుట్టిన అశ్విన్... అంతటితో ఆగిపోకుండా ఆ తర్వాత మరో ఐదు వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అంతే కాదు... తన సమయస్ఫూర్తితో మరో రెండు రనౌట్లను కూడా తన ఖాతాలో వేసుకొని మూడో రోజు ఆటలో తన స్కోరు 8/10గా చేసేశాడు! అశ్విన్ రికార్డు ప్రదర్శనతో సిరీస్ క్లీన్‌స్వీప్ దిశగా భారత్ మరో అడుగు దిగ్విజయంగా వేసింది.
 

తొలి వికెట్‌కు 118 పరుగులు... ఎట్టకేలకు కివీస్ కూడా భారత గడ్డపై ఆడటం నేర్చుకుంది అనుకునే లోపే పతనం ప్రారంభం... 30 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు... అంతే, మరోసారి విలియమ్సన్ బృందం మంచి చాన్‌‌సను చేజార్చుకుంది. ముగ్గురు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు చేసినా, సిరీస్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసినా... భారీ ఆధిక్యం కోల్పోయిన ఆ జట్టు మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకునే అవకాశానికి చాలా దూరమైపోయి0ది. ఇప్పటికే 276 పరుగులు ముందంజలో ఉన్న కోహ్లి సేన నాలుగో రోజు చెలరేగి మరిన్ని పరుగులు సాధిస్తే ఇక లక్ష్యాన్ని ఛేదించడం కివీస్‌కు కలగానే మారిపోవడం ఖాయం.  
 

ఇండోర్:  సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే దిశగా భారత జట్టు సాగుతోంది. అనూహ్యమేదైనా జరిగితే తప్ప... వరల్డ్ నంబర్‌వన్ టీమ్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడం దాదాపుగా ఖాయమైంది. ఇక్కడి హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టుపై భారత్ పట్టు మరింత బిగిసింది. న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 90.2 ఓవర్లలో 299 పరుగులకు ఆలౌటైంది. గప్టిల్ (144 బంతుల్లో 72; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), నీషమ్ (115 బంతుల్లో 71; 11 ఫోర్లు), లాథమ్ (104 బంతుల్లో 53; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. అశ్విన్ (6/81) మరోసారి చెలరేగడంతో కివీస్ కుప్పకూలింది.

మరో స్పిన్నర్ రవీంద్ర జడేజాకు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్‌‌సలో భారత్‌కు 258 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే బౌలర్లకు తగిన విశ్రాంతి ఇవ్వాలని భావించిన కెప్టెన్ కోహ్లి ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించలేదు. అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్‌‌సలో వికెట్ కోల్పోకుండా 18 పరుగులు చేసింది. అయితే గాయం కారణంగా గంభీర్ (6) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగ్గా... విజయ్ (11), పుజారా (1) క్రీజ్‌లో ఉన్నారు. మంగళవారం వేగంగా బ్యాటింగ్ చేసి కివీస్‌కు అందనంత లక్ష్యాన్ని నిర్ధేశించాలని భారత్ భావిస్తోంది.
 
తొలి సెషన్:  కివీస్ ఓపెనర్లు జోరు
ఓవర్‌నైట్ స్కోరు 28/0తో మూడో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ ఓపెనర్లు గప్టిల్, లాథమ్ ఆత్మవిశ్వాసంతో ఆడారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొలిసారి జట్టుకు శుభారంభం అందించారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉండటం కూడా వారికి కలిసొచ్చింది.  ముఖ్యంగా గత రెండు టెస్టుల్లో కలిపి 58 పరుగులే చేసిన గప్టిల్ ఈసారి క్రీజ్‌లో గట్టిగా నిలబడ్డాడు. 21 పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో తను ఇచ్చిన క్యాచ్‌ను గల్లీలో రహానే వదిలేయగా... కొద్దిసేపటికి షమీ బౌలింగ్‌లోనే 31 పరుగుల వద్ద లాథమ్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ మిడ్ వికెట్‌లో అందుకోవడంలో జడేజా విఫలమయ్యాడు.

మొదటి పది ఓవర్ల పాటు పేసర్లతో బౌలింగ్ చేయి0చిన కోహ్లి, ఆ తర్వాత స్పిన్నర్లను రంగంలోకి దించాడు. జడేజా ఓవర్లో వరుస బంతుల్లో ఫోర్, సిక్సర్ కొట్టి దూకుడు ప్రదర్శించిన గప్టిల్ 86 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అశ్విన్ వేసిన తర్వాతి ఓవర్లో లాథమ్ మూడు ఫోర్లు కొట్టి జోరు ప్రదర్శించాడు. ఈ క్రమంలో 95 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయి0ది. అనంతరం జడేజా బౌలింగ్‌లో లాథమ్ ఆడిన స్వీప్ షాట్ అతని కాలికి తగిలి స్లిప్‌లో రహానే చేతుల్లో పడ్డా అంపైర్ దీనిని గుర్తించలేదు. అయితే తర్వాతి ఓవర్లోనే అశ్విన్ కివీస్‌పై తొలి దెబ్బ వేశాడు. చక్కటి బంతితో లాథమ్‌ను అవుట్ చేసి భారీ భాగస్వామ్యానికి తెర దించాడు. ఈ వికెట్‌తో కివీస్ పతనం మొదలైంది.
ఓవర్లు: 30, పరుగులు: 97, వికెట్లు: 1
 
రెండో సెషన్: అశ్విన్ దెబ్బ
లంచ్ తర్వాత ఒక్కసారిగా భారత జట్టు ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా అశ్విన్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పేశాడు. అశ్విన్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని ముందుగా విలియమ్సన్ (8) పెవిలియన్ చేరాడు. తర్వాతి ఓవర్లో మరో చక్కటి బంతితో టేలర్ (0)ను అవుట్ చేసిన అశ్విన్ చాకచక్యం గప్టిల్ రనౌట్‌కు కారణమైంది. తన బౌలింగ్‌లో రోంచీ కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్‌ను అడ్డుకునే ప్రయత్నంలో అశ్విన్ చేతికి తగిలిన బంతి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో వికెట్లను పడగొట్టింది.

దాంతో గప్టిల్ చక్కటి ఇన్నింగ్‌‌స దురదృష్టకర రీతిలో ముగిసింది. ఆ వెంటనే అశ్విన్, రోంచీ (0)ని కూడా వెనక్కి పంపాడు. ఆరు ఓవర్ల వ్యవధిలో 14 పరుగులు మాత్రమే చేసి కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయి0ది. ఈ దశలో నీషమ్, వాట్లింగ్ (48 బంతుల్లో 23; 4 ఫోర్లు) కలిసి కివీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నీషమ్ చక్కటి బౌండరీలతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 53 పరుగులు జోడించిన అనంతరం జడేజా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.
ఓవర్లు: 29, పరుగులు: 91, వికెట్లు: 5
 
మూడో సెషన్: నీషమ్ పోరాటం
విరామం తర్వాత నీషమ్, సాన్‌ట్నర్ (52 బంతుల్లో 22; 4 ఫోర్లు) పట్టుదల కనబర్చి మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో నీషమ్ 85 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 52 పరుగులు జత చేసిన తర్వాత జడేజా బౌలింగ్‌లో సాన్‌ట్నర్ వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే నీషమ్‌ను ఎల్బీగా అవుట్ చేసి అశ్విన్ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

తన తర్వాతి ఓవర్లో అశ్విన్, ముందుగా హెన్రీ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసినా... సమయస్ఫూర్తితో గప్టిల్‌ను అవుట్ చేసిన తరహాలోనే బంతిని నాన్‌స్ట్రైకింగ్ వికెట్లపైకి తోసి పటేల్ (18)ను రనౌట్ చేశాడు. చివర్లో బౌల్ట్ (0)ను పెవిలియన్ పంపించి కివీస్ ఇన్నింగ్‌‌సను అతను ముగించాడు.  ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్‌‌స బరిలోకి దిగిన భారత్ ప్రశాంతంగా ఆరు ఓవర్ల ఆటను ముగించింది. అయితే పిచ్‌పై పరుగెత్తినందుకు అంపైర్లు రెండుసార్లు విజయ్‌ను హెచ్చరించగా... రెండో పరుగు కోసం ప్రయత్నించి భుజం గాయం తిరగబెట్టడంతో గంభీర్ మైదానం వీడాడు.
ఓవర్లు: 22.2, పరుగులు: 83, వికెట్లు: 4 (న్యూజిలాండ్)
ఓవర్లు: 6, పరుగులు: 18, వికెట్లు: 0 (భారత్)
 

గంభీర్‌కు గాయం  
రెండేళ్ల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన గౌతమ్ గంభీర్ అనూహ్య రీతిలో గాయంతో వెనుదిరిగాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్‌‌స 51వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తుండగా కింద పడటంతో అతని కుడి భుజానికి గాయమైంది. మైదానం వదిలిన అతను కొంత సేపటి తర్వాత కోలుకున్నట్లు కనిపించాడు. అయితే తను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండో పరుగు కోసం ప్రయత్నించి డైవ్ చేయడంతో ఈ నొప్పి తిరగబెట్టింది. బాధతో విలవిల్లాడిన గంభీర్, ఫిజియో సహాయంతో నిష్ర్కమించాడు. గాయం తీవ్రత గురించి ఇంకా స్పష్టత లేకున్నా... రెండో ఇన్నింగ్‌‌సలో అతను మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశమైతే లేదు.
 
ఇన్నింగ్‌‌సలో 5 వికెట్లు తీయడం అశ్విన్ కెరీర్‌లో ఇది 20వసారి. కేవలం 39 టెస్టుల్లోనే అతను ఈ రికార్డును నమోదు చేశాడు. బార్నెస్ (25), గ్రిమ్మెట్ (37)లు మాత్రమే అతనికంటే వేగంగా ఈ ఘనత సాధించగా, భారత్ తరఫున హర్భజన్‌కు 59 టెస్టులు పట్టాయి.
 
 భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ (213) ఎనిమిదో స్థానానికి చేరాడు. ఇషాంత్ శర్మ (209)ను అతను వెనక్కి తోశాడు.  
 
ఆరంభంలో నేను బంతిని నియంత్రించడంలో విఫలమయ్యాను. అయితే ఒక్కసారి పట్టు చిక్కాక ఇక వరుసగా వికెట్లు వచ్చిపడ్డాయి. ఇలాంటి ఆటతో ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్‌నైనా పడగొట్టగలనని నాకు తెలుసు. విలియమ్సన్‌ను అవుట్ చేసేందుకు సిరీస్‌కు ముందే మంచి ప్రణాళికతో సిద్ధమయ్యా. ఇతర బౌలర్ల నుంచి కూడా నాకు మంచి సహకారం లభించింది.

తొలి సెషన్‌లో కివీస్ ఆటగాళ్లు బాగా ఆడినా... ఆ తర్వాత పరుగులు నిరోధించి ఒత్తిడి పెంచాలనే మా ఆలోచన ఫలించింది. ఈ మ్యాచ్‌లో ఇంకా చాలా సమయం ఉంది. నేను, జడేజా సుదీర్ఘంగా బౌలింగ్ చేశాం కాబట్టి ఫాలోఆన్ ఇవ్వకపోవడం సరైన నిర్ణయమే. బ్యాట్స్‌మెన్ సెంచరీల గురించి ఆలోచించినట్లుగా నేను కూడా బరిలోకి దిగేటప్పుడు ఐదు వికెట్లు తీయాలని ప్రయత్నిస్తా. నేను ఇంత బాగా బౌలింగ్ చేయడంలో కోచ్ కుంబ్లే వ్యూహాలు కూడా కీలక పాత్ర పోషించారుు.  -అశ్విన్
 
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్‌‌స 557/5 డిక్లేర్డ్, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్‌‌స:  గప్టిల్ (రనౌట్) 72; లాథమ్ (సి) అండ్ (బి) అశ్విన్ 53; విలియమ్సన్ (బి) అశ్విన్ 8; రాస్ టేలర్ (సి) రహానే (బి) అశ్విన్ 0; రోంచీ (సి) రహానే (బి) అశ్విన్ 0; నీషమ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 71; వాట్లింగ్ (సి) రహానే (బి) జడేజా 23; సాన్‌ట్నర్ (సి) కోహ్లి (బి) జడేజా 22; పటేల్ (రనౌట్) 18; హెన్రీ (నాటౌట్) 15; బౌల్ట్ (సి) పుజారా (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (90.2 ఓవర్లలో ఆలౌట్) 299.
వికెట్ల పతనం: 1-118; 2-134; 3-140; 4-148; 5-148; 6-201; 7-253; 8-276; 9-294; 10-299.
బౌలింగ్: షమీ 13-1-40-0; ఉమేశ్ 15-1-55-0; అశ్విన్ 27.2-5-81-6; జడేజా 28-5-80-2; విజయ్ 7-0-27-0.
భారత్ రెండో ఇన్నింగ్‌‌స: విజయ్ (బ్యాటింగ్) 11; గంభీర్ (రిటైర్డ్ హర్ట్) 6; పుజారా (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 18.
బౌలింగ్:  బౌల్ట్ 3-0-9-0; పటేల్ 2-0-8-0; సాన్‌ట్నర్ 1-0-1-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement