
న్యూఢిల్లీ: భారత యువ షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరీలు మళ్లీ స్వర్ణంపై గురి పెట్టారు. చైనీస్ తైపీలో జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో ఇద్దరు తమ పసిడి పతకాల్ని డబుల్ చేసుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో మను భాకర్ బంగారు పతకం నెగ్గింది. క్వాలిఫయింగ్‌లో 575 పాయింట్లు స్కోరు చేసిన మను... ఫైనల్లో 239 పాయింట్లు సాధించింది. షి హో చింగ్ (హాంకాంగ్–237.9 పాయింట్లు) రజతం... అలాలీ వఫా (యూఏఈ– 216.8 పాయింట్లు) కాంస్యం సాధించారు. మను భాకర్, శ్రీనివేత, అనురాధాలతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1702 పాయింట్లతో కాంస్యం సాధించింది.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌టీమ్ ఈవెంట్‌లో సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ, రవీందర్‌లతో కూడిన భారత బృందం స్వర్ణం గెల్చుకుంది. భారత బృందం మొత్తం 1742 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించింది. సౌరభ్, అభిషేక్ వర్మ, రవీందర్ ఫైనల్ చేరుకోగా... అభిషేక్ వర్మ (240.7 పాయింట్లు) రజతం సాధించాడు. సౌరభ్ నాలుగో స్థానంలో, రవీందర్ సింగ్ ఏడో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు భారత్ ఐదు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment